Rains Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో వానలు పడగా.. రాబోయే మూడ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెపింది.

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విషయానికొస్తే.. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో వానలు పడతాయని తెలిపింది. జూన్ 25వ తేదీన విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఇక ఈ నెల 26,27వ తేదీన కోస్తా, రాయలసీమలో పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని, వానలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండవద్దని, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప వర్షాల సమయలో బయటకు వెళ్లకపోవడం మంచిదని చెబుతున్నారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటు పలు జిల్లాల్లో ఎండలు కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
తెలంగాణకు వర్షసూచన
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మరియు కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. హైదరాబాద్‌లో కూడా ఇవాళ స్వల్ప వర్షం పడుతుందని తెలిపింది.
