AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup 2026: నేడే బంగ్లాదేశ్‌తో తేల్చుకోనున్న టీమిండియా.. సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలో తెలుసా?

Women's T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే భారత్ బంగ్లాదేశ్‌పై తప్పనిసరిగా గెలవాలి. ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా కీలకం. సౌతాఫ్రికాతో పోటీ నేపథ్యంలో నెట్ రన్ రేట్, పాయింట్ల సమీకరణాలు ఇప్పుడు టీమిండియా భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

Women's T20 World Cup 2026: నేడే బంగ్లాదేశ్‌తో తేల్చుకోనున్న టీమిండియా.. సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలో తెలుసా?
Women's T20 World Cup 2026
Rakesh
|

Updated on: Jun 25, 2026 | 11:16 AM

Share

Women’s T20 World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ప్రయాణం ఉత్కంఠభరితంగా మారింది. టోర్నమెంట్‌లో తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత జట్టు గురువారం మాంచెస్టర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా, గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్हత సాధించింది. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క సెమీస్ బెర్త్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

భారత జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ మంచి ఫామ్‌లో ఉంటూ జట్టుకు గట్టి పునాది వేస్తున్నారు. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాలు టీ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా వంటి సీనియర్ ప్లేయర్లు ఓపెనర్లు ఇచ్చిన ఊపును కొనసాగించలేకపోతున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో హర్మన్, జెమిమా కలిసి కేవలం 11 ఫోర్లు మాత్రమే కొట్టారు, ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. దీనివల్ల చివర్లో వచ్చే రిచా ఘోష్, దీప్తి శర్మలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు జట్టు పేలవమైన ఫీల్డింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది.

రెండు మ్యాచ్‌లు గెలిస్తే దర్జాగా సెమీస్‌కు

భారత జట్టు సెమీఫైనల్ చేరడానికి అత్యంత సులువైన, సురక్షితమైన మార్గం ఏమిటంటే.. లీగ్ దశలో తమకు మిగిలి ఉన్న బంగ్లాదేశ్ (జూన్ 25), ఆస్ట్రేలియా (జూన్ 28) రెండు జట్లపై విజయం సాధించడం. ఇలా జరిగితే భారత్ గరిష్టంగా 8 పాయింట్లతో నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ సౌతాఫ్రికా కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై) గెలిచి 8 పాయింట్లు సాధించినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ నెట్ రన్ రేట్ (+2.511) ప్రస్తుతానికి సౌతాఫ్రికా (-0.546) కంటే చాలా మెరుగ్గా ఉంది కాబట్టి భారత్ సులభంగా ముందంజ వేస్తుంది.

ఒక మ్యాచ్ గెలిచి.. ఒక మ్యాచ్ ఓడిపోతే

ఒకవేళ భారత్ రాబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒకదానిలో గెలిచి, మరోదానిలో (ముఖ్యంగా ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోతే జట్టు ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు భారత్ సెమీస్ చేరడం అనేది పూర్తిగా సౌతాఫ్రికా జట్టు ఓటమిపై ఆధారపడి ఉంటుంది. బలహీనమైన నెదర్లాండ్స్ లేదా బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలని భారత్ ప్రార్థించాలి. సౌతాఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోతే, మెరుగైన రన్ రేట్ ఆధారంగా భారత్ సెమీస్ చేరుకుంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే మాత్రం భారత్ టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.

రెండింటిలోనూ ఓడిపోతే ఇంటికే

ఒకవేళ ఊహించని విధంగా భారత మహిళల జట్టు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా రెండు జట్ల చేతిలోనూ పరాజయం పాలైతే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ టోర్నమెంట్ నుంచి పూర్తిగా ఎలిమినేట్ అవుతుంది. అదే జరిగితే తొలిసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవాలనే భారత మహిళల కల మరో రెండేళ్ల పాటు ముందుకు సాగుతుంది. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్‌పై భారీ రన్ రేట్‌తో గెలవడమే కాకుండా, బలమైన ఆస్ట్రేలియాను కూడా ఓడించడంపైనే భారత్ పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us