పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..
మీరు తెచ్చిన పచ్చిమిరపకాయలు ఫ్రిజ్‌లో పెట్టినా త్వరగా కుళ్లిపోతున్నాయా? అయితే మీరు నిల్వ చేసే పద్ధతిలో ఏదో తప్పు జరుగుతుందిని అర్థం.. చాలామంది మిరపకాయలను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు వాటి తాజాదనాన్ని దెబ్బతీస్తాయి. మిరపకాయల రుచి, రంగు మారకుండా దాదాపు 20 రోజుల పాటు నిల్వ ఉంచే చిట్కాలు ఇవే..

మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తెచ్చిన వెంటనే కడగవద్దు.. తేమ లేకుండా చూడండి..
చాలామంది మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. వాటిపై మిగిలి ఉండే తడి లేదా తేమ మిరపకాయలు కుళ్లిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల వాటిని కూరల్లో వాడే సమయంలో మాత్రమే కడగడం మంచిది. ఒకవేళ కడిగినా.. అవి పూర్తిగా తడి ఆరిన తర్వాతే నిల్వ చేయాలి.
కాడలు తీసివేయడం అత్యంత ముఖ్యం
పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటి కాడలను వేరు చేయడం అతి ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే మిరపకాయ కాడ భాగం తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది. దీనివల్ల మిరపకాయలు పైనుంచే కుళ్లిపోవడం స్టార్ట్ అవుతాయి. అందువల్ల నిల్వ చేసే ముందు కాడలను జాగ్రత్తగా తీసివేసి పక్కన పెట్టాలి.
ఎయిర్ టైట్ బాక్స్
కాడలు తీసేసిన పచ్చిమిరపకాయలను నేరుగా డబ్బాలో వేయకుండా.. ఒక టిష్యూ పేపర్‌లో లేదా కిచెన్ టవల్‌లో చుట్టాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లోని కూరగాయల అరలో గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి నిల్వ చేయాలి. టిష్యూ పేపర్ లోపల ఉండే అదనపు తేమను పీల్చుకుని, మిరపకాయలు త్వరగా పాడవకుండా నివారిస్తుంది. ఒకవేళ కొన్ని రోజులకు ఆ టిష్యూ తడిసినట్లు అనిపిస్తే, దానిని మార్చి కొత్త టిష్యూ పెట్టాలి.
సాధారణ ప్లాస్టిక్ కవర్లు వద్దు..
మిరపకాయలను గాలి అస్సలు ఆడని సాధారణ ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. దీనివల్ల కవర్ లోపల నీటి బిందువులు ఏర్పడి, అవి త్వరగా కుళ్లిపోయే అవకాశం పెరుగుతుంది. వీలైతే చిన్న చిన్న ఎయిర్ వెంట్స్ ఉన్న ప్లాస్టిక్ పాత్రను లేదా కొద్దిగా తెరిచి ఉన్న నిల్వ పెట్టెను ఉపయోగించడం సురక్షితం.
పచ్చిమిరపకాయలను ఇలా జాగ్రత్తగా నిల్వ చేస్తే, అవి సుమారు రెండు నుండి మూడు వారాల పాటు వాటి సహజమైన రుచి, రంగు, తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. దీనివల్ల డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా వంటగదిలో ఆహార వ్యర్థాలు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
