ఒడెసా తీరంలో ఘోరం.. ధాన్యం నౌకపై క్షిపణుల వర్షం.. నలుగురు భారతీయులు మృతి
ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు సమీపంలో జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. ధాన్యం రవాణా చేస్తున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై దాడి జరగడంతో మరో భారతీయుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

ఉక్రెయిన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒడెసా ఓడరేవు సమీపంలో జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ధాన్యం రవాణా చేస్తున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై క్షిపణుల వర్షం కురిసింది. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, గినియా-బిస్సావు జెండాతో ఎంవీ గోల్డెన్ లియో నౌక ప్రయాణిస్తోంది. జూలై 19న ఒడెసా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే క్షిపణి దాడికి గురైంది. నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. దాడిలో నలుగురు భారతీయులు మరణించగా, మరో భారతీయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భారత ప్రభుత్వం, గాయపడిన భారతీయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ బాధితులకు అవసరమైన సహాయం అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఘటనపై స్పందించిన భారత్, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొంది. సాయుధ ఘర్షణల సమయంలో కూడా అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను గౌరవించాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ అధికారులు ఈ దాడికి రష్యా కారణమని ఆరోపిస్తున్నప్పటికీ, భారత్ తన ప్రకటనలో ఏ దేశం పేరును ప్రస్తావించలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో భారతీయులు, సిరియా పౌరులు సిబ్బందిగా ఉన్నారు. దాడి అనంతరం రాత్రంతా గాలింపు, సహాయక చర్యలు కొనసాగాయని ఉక్రెయిన్ ఓడరేవుల ప్రాధికార సంస్థ తెలిపింది. ఘటనలో తొమ్మిది మంది సిబ్బంది, ఒక మెరైన్ పైలట్ మృతి చెందగా, 17 మంది సిబ్బందిలో ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఎల్‌ఎస్‌ఈజీ షిప్పింగ్ డేటా ప్రకారం, గోల్డెన్ లియో నౌక ముంబైకి చెందిన ఓషన్ గ్రేస్ షిప్పింగ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉండగా, ఫ్రెండ్స్ షిప్పింగ్ కో ఎస్‌ఏ నిర్వహిస్తోంది.
2022లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నల్ల సముద్రం ప్రపంచంలోనే అత్యంత కీలక యుద్ధ ప్రాంతంగా మారింది. ఈ ప్రాంతం గుండా జరిగే ధాన్యం రవాణా ప్రపంచ ఆహార భద్రతకు కీలకం. అయితే ఇటీవల ఇరు దేశాలు పరస్పరం ఓడరేవులు, ఇంధన మౌలిక సదుపాయాలు, సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెంచడంతో వాణిజ్య నౌకాయానం తీవ్రంగా దెబ్బతింటోంది.
ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో సుమారు 6 శాతం, మొక్కజొన్న ఎగుమతుల్లో దాదాపు 11 శాతం ఉక్రెయిన్ వాటా ఉండటంతో ఈ దాడులు అంతర్జాతీయ ఆహార సరఫరాపై కూడా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి సామర్థ్యం గణనీయంగా తగ్గగా, ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా కూడా అజోవ్ సముద్రం గుండా జరిగే తన ధాన్యం రవాణాపై పరిమితులు విధించినట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
