AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65) ప్రమాదాలమయంగా మారింది. నాలుగు లేన్లుగా అభివృద్ధి చెంది దశాబ్దం గడిచినా, ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, గూడ్స్ వాహనాలు మితిమీరిన వేగం, సరైన ఫిట్‌నెస్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నడపడం వంటి కారణాలతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..
Accident
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 12:43 PM

Share

దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతుంది. ఈ హైవేపై ప్రయాణించాలంటేనే వాహనదారుల వణికి పోతున్నారు. ఈ హైవేపై నిత్యం 50 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా వారాంతం, సెలవు దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద అధిక లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి.. కారుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. 16 వీల్స్ ఉన్న భారీ ట్యాంకర్ ఫిట్నెస్ లేక బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతోపాటు అడుగడుగునా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో హైవేపై లారీ బస్సు ఢీకొంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పామనుగుడ్ల వద్ద ఆర్టీసీ బస్సు టైరు పేలి అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టింది. తృటిలో పేలు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు ఈ హైవేపై నిత్య కృత్యంగా మారాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏటా వేలాది ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఇందులో వెయ్యి మందికి పైగా మృత్యువాత పడుతుండగా అనేకమంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఈ హైవేపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. ఈ హైవేపై రోడ్డు ఎక్కిన వారు తిరిగి ప్రాణాలతో ఇంటికి చేరే గ్యారెంటీ లేకపోవడంతో ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు.

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే 17 ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) లు బ్లాక్ స్పాట్స్ గా గుర్తించింది. బ్లాక్ స్పాట్స్, హైరిస్క్ ప్రదేశాలలో వాహన అండర్‌ పాస్‌లను నిర్మించడం, జంక్షన్‌లను మెరుగు పరచడం, సైన్ బోర్డ్, హెవీ స్పీడ్‌ కంట్రోల్‌ వంటి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతోంది. ఈ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో(బ్లాక్ స్పాట్స్) దిద్దుబాటు పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నారు.

వాహనాల రద్దీతోపాటు బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ హైవేపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకోవడం గగనంగా మారింది. నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో హైవే ప్రయాణం కష్టతరంగా ఉంది. ఇరుకైన సర్వీస్ రోడ్లతో వాహనదారులు గంటలు తరబడి ట్రాఫిక్ జామ్ లలో నిరీక్షించాల్సి వస్తోంది. వీకెండ్ తో పాటు ఫెస్టివల్స్ సమయాల్లో ఈ హైవేపై ప్రయాణించాలంటే వాహనదారులు వణికి పోతున్నారు. బ్లాక్ స్పాట్స్ నిర్మాణ పనుల వద్ద తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎంతోమంది క్షతగాత్రులు అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల అరికట్టాల్సిన అవసరం ఉంది.

Also Read: హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన DCM వాహనం.. తనిఖీ చేయగా.. 

Follow Us