తెలంగాణ ఓటర్లకు అలర్ట్! 30 లక్షల ఓట్ల తొలగింపు? మీ ఓటు భద్రంగా ఉందో లేదో చెక్ చేసుకోండిలా..
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR), ప్రీ-SIR మ్యాపింగ్ ప్రక్రియ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఓట్ల తొలగింపు ప్రభావం మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఉండబోతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కారణంగా దాదాపు 30 లక్షల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా సుమారు 29.6 లక్షల ఓట్లు ఇంకా అన్‌మ్యాప్‌డ్‌గా ఉన్నాయని, దీని ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉండబోతోందని తెలుస్తోంది. హైరాబాద్‌లో ఎందుకంత ప్రభావం?
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో హైదరాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46.79 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో కేవలం 17.17 లక్షల (సుమారు 36.7శాతం) మంది మాత్రమే విజయవంతంగా మ్యాప్ చేయబడ్డారు. మిగిలిన దాదాపు 29.6 లక్షల మంది ఓటర్లు ఇంకా అన్‌మ్యాప్‌డ్‌గా అంటే.. చిరునామా లేదా గుర్తింపు స్పష్టత లేనివిగా మిగిలిపోయారు. ఈ భారీ వ్యత్యాసం వల్లే హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు ప్రక్రియ పెద్ద ఎత్తున సాగే అవకాశం కనిపిస్తోంది.
తొలగింపునకు గల సాంకేతిక కారణాలు:
ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపునకు గురికావడానికి కొన్ని సాంకేతిక, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి:
నకిలీ, డ్యూప్లికేట్ ఓట్లు: ఒకే వ్యక్తి పేరు రెండు లేదా అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలలో ఉండటం.
ఫోటోల పోలికలు: ఒకే ఫోటోను ఉపయోగించి వేర్వేరు పేర్లతో లేదా వివరాలతో ఓటు హక్కు పొందడం.
వలసలు, మరణాలు: ఎన్నో ఏళ్లుగా ఇళ్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, లేదా మరణించిన వారి పేర్లు ఇప్పటికీ పాత జాబితాలోనే కొనసాగుతుండటం.
అధికారులు, రాజకీయ పార్టీల అలర్ట్: ఈ భారీ ఓట్ల తొలగింపు వార్తలతో అటు ఓటర్లలో ఆందోళన మొదలవ్వగా, ఇటు రాజకీయ పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. తమ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వంటి ప్రధాన పార్టీలు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఓటర్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేస్తున్నాయి.
మరోవైపు ఎన్నికల అధికారులు స్పందిస్తూ.. ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వచ్చి ధృవీకరించుకున్న తర్వాతే, నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి ఓట్లను తొలగిస్తారని తెలిపారు. పొరపాటున ఓట్లు తొలగించబడినా తిరిగి నమోదు చేసుకునేందుకు ఫారమ్-6 అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లు ఎవరికి వారు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా తమ ఓటు స్థితిని చెక్ చేసుకోవడం ఉత్తమం.
మీ ఓటును ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా:
ఈ ప్రక్రియ కారణంగా మీ ఓటు హక్కు తొలగించబడకుండా ఉండాలంటే, వెంటనే ఓటర్ల జాబితాలో మీ పేరును సరిచూసుకోవడం ఉత్తమం.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (voters.eci.gov.in) లేదా Voter Helpline మొబైల్ యాప్‌ను సందర్శించండి.
‘Search in Electoral Roll’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ ఎపిక్ (EPIC) కార్డ్ నంబర్ (ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య) లేదా మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సెర్చ్ చేయండి.
జాబితాలో మీ పేరు కనిపిస్తే మీ ఓటు సురక్షితంగా ఉన్నట్లే. ఒకవేళ వివరాలు రాకపోతే తక్షణమే స్థానిక ఎన్నికల కార్యాలయంలో లేదా ఆన్‌లైన్ ద్వారా ఫారమ్-6 సమర్పించి తిరిగి నమోదు చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. కాబట్టి, తెలంగాణలోని ఓటర్లందరూ బాధ్యతగా తమ ఓటు స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు, సామాజిక విశ్లేషకులు కోరుతున్నారు.




