ఇది పక్షి కాదు.. ప్రకృతి శాస్త్రవేత్త..! ఎన్ని గుడ్లు పెడుతుందో అదే మంచి కాలానికి సూచన
ఆధునిక కాలంలో వాతావరణ శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ద్వారా వర్షాలను అంచనా వేస్తుంటే, గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ ఒక పక్షి ద్వారా రుతుపవనాల రాకను గుర్తిస్తారు. ఈ పక్షి పెట్టే గుడ్ల సంఖ్య, అవి ఉండే స్థానాన్ని బట్టి ఆ ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతుందో గ్రామీణులు ముందే ఊహిస్తారు. అలాగే ఇది ఎన్ని గుడ్లు పెడితే అన్ని నెలల పాటు వర్షాలు పడతాయని పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆసక్తికరమైన విశ్వాసం. ఆ ప్రత్యేక పక్షి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులను, వర్ష సూచనలను తెలుసుకోవడానికి సైంటిస్టులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉపగ్రహాలను (సాటిలైట్స్) ఉపయోగిస్తున్నారు. అయితే సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో, మన పూర్వీకులు ప్రకృతిలోని మార్పులను, పక్షులు, జంతువుల ప్రవర్తనను బట్టి వాతావరణాన్ని చాలా ఖచ్చితంగా అంచనా వేసేవారు. అలాంటి ఒక అద్భుతమైన, ఆసక్తికరమైన సాంప్రదాయం టిటహరి పక్షి (Tithari Bird / Red-wattled Lapwing) గుడ్ల ద్వారా వర్షపాతాన్ని అంచనా వేయడం.
గ్రామీణ ప్రాంతాల్లో శతాబ్దాలుగా వస్తున్న నమ్మకాల ప్రకారం, టిటహరి పక్షిని ఒక సహజ వాతావరణ సూచికగా భావిస్తారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పక్షి చేసే కొన్ని పనులు, అది గుడ్లు పెట్టే విధానం ఆధారంగా ఆ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయో రైతులు ఒక అంచనాకు వస్తారు.
సాధారణంగా టిటహరి పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. జానపద నమ్మకాల ప్రకారం, ఈ పక్షి ఎన్ని గుడ్లు పెడితే, ఆ ఏడాది అన్ని నెలల పాటు వర్షాలు కురుస్తాయని గ్రామీణులు నమ్ముతారు. ఉదాహరణకు, పక్షి నాలుగు గుడ్లు పెడితే ఆ సీజన్‌లో నాలుగు నెలల పాటు మంచి వర్షపాతం నమోదవుతుందని భావిస్తారు.
అంతేకాదు.. ఈ పక్షి గుడ్లు పెట్టే స్థానాన్ని బట్టి కూడా వర్ష తీవ్రతను అంచనా వేస్తారు. ఈ పక్షి సాధారణంగా చెట్లపై కాకుండా భూమిపైనే చిన్న చిన్న గుంతల్లో గుడ్లు పెడుతుంది. అయితే వాతావరణ సూచనను ఇది పెట్టే స్థానాన్ని బట్టి గుర్తిస్తారు. టిటహరి పక్షి కొండలపై, గుట్టలపై లేదా ఇళ్ల పైకప్పుల వంటి ఎత్తైన ప్రదేశాలలో గుడ్లు పెడితే, ఆ సంవత్సరం విపరీతమైన భారీ వర్షాలు కురుస్తాయని అర్థం. వరదల నుండి తన గుడ్లను రక్షించుకోవడానికే అది ముందే గ్రహించి ఎత్తైన ప్రాంతాన్ని ఎంచుకుంటుందని నమ్ముతారు.
ఒకవేళ ఈ పక్షి పొలాల్లోని లోతట్టు ప్రాంతాలలో లేదా ఎండిపోయిన వాగులు, వంకలలో గుడ్లు పెడితే ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడవని, కరువు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతారు. మన దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి అనేక రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ నమ్మకం బలంగా ఉంది. వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ, చాలా మంది రైతులు తమ సాగు పనుల ప్రణాళిక కోసం ఈ పక్షి ఇచ్చే ప్రకృతి సంకేతాలనే నమ్ముకోవడం విశేషం.




