AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో 5 వికెట్లు పడితే ఓటమి.. కట్‌చేస్తే.. రూట్ మార్చి లెఫ్ట్ హ్యాండ్‌తో టీమిండియా ప్లేయర్ బీభత్సం.. రిజల్ట్ ఏంటంటే?

Team India Player Sunil Gavaskar Left Handed Batting: మైదానంలో ఎంతటి ఒత్తిడి ఉన్నా సరే తన చాతుర్యంతో మ్యాచ్ రూపురేఖలను మార్చేయగలరని గవాస్కర్ మరోసారి నిరూపించారు. క్రికెట్ నియమాలను గౌరవిస్తూనే జట్టును ఓటమి నుంచి రక్షించిన ఆయన సమయస్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది.

మరో 5 వికెట్లు పడితే ఓటమి.. కట్‌చేస్తే.. రూట్ మార్చి లెఫ్ట్ హ్యాండ్‌తో టీమిండియా ప్లేయర్ బీభత్సం.. రిజల్ట్ ఏంటంటే?
Sunil Gavaskar Left Handed Batting
Venkata Chari
|

Updated on: Aug 11, 2026 | 12:14 PM

Share

Sunil Gavaskar Left Handed Batting: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా పేరుగాంచిన సునీల్ గవాస్కర్ ఓ మ్యాచ్‌లో అనూహ్యంగా ఎడమచేతి బ్యాటర్‌గా మారిపోయారు. కళ్లముందే జట్టు ఓటమి ఖాయమనుకున్న తరుణంలో ప్రత్యర్థి బౌలర్‌ను కంగుతినిపిస్తూ ఆయన చేసిన సాహసం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ చారిత్రాత్మక మ్యాచ్‌లోనే అసలైన లిటిల్ మాస్టర్ చాతుర్యం వెలుగుచూసింది.

సునీల్ గవాస్కర్ అనగానే క్రమశిక్షణ, అద్భుతమైన టెక్నిక్, వికెట్ పడకుండా కాపాడుకునే సహనం గుర్తుకొస్తాయి. ఎటువంటి పిచ్‌పైనైనా క్రీజులో పాతుకుపోవడం ఆయన నైజం. అయితే టెక్నాలజీ, ఆధునిక షాట్లు లేని ఆ రోజుల్లోనే ఆయన చూపించిన సమయస్ఫూర్తి అపూర్వం. 1981-82 రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ ముంబై, కర్ణాటక జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగింది. ఆ మ్యాచ్‌లో కర్ణాటక లెఫ్టార్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ రఘురామ్ భట్ తొలి ఇన్నింగ్స్‌లోనే 8 వికెట్లు తీసి ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టారు.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి

రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ధాటిని కొనసాగిస్తూ ముంబై అగ్రశ్రేణి బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపారు. కేవలం 5 వికెట్లు తీస్తే కర్ణాటక సులువుగా ఫైనల్ చేరుకునే పరిస్థితి ఏర్పడింది. మైదానంలో పడిన గుంతలను (రఫ్ ప్యాచ్) టార్గెట్ చేస్తూ కుడిచేతి బ్యాటర్లకు బంతిని దొరక్కుండా తిప్పుతూ భట్ భయంకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. ముంబై ఓటమి దాదాపు ఖాయమైన ఆ క్లిష్ట సమయంలో గవాస్కర్ తన మేధస్సుకు పదును పెట్టాడు.

ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఎడమచేతితో బ్యాటింగ్..!

రఘురామ్ భట్ విసురుతున్న బంతులు కుడిచేతి బ్యాటర్ల బ్యాట్ అంచులను తాకుతూ స్లిప్‌లో క్యాచ్‌లుగా వెళ్తున్నాయి. దీని నుంచి తప్పించుకోవడానికి గవాస్కర్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఎడమచేతి బ్యాటర్‌గా క్రీజులోకి నిలబడ్డారు. ఎడమచేతి వాటం బ్యాటర్‌కు బంతి బయటకు వెళ్లకుండా ప్యాడ్ వైపు మాత్రమే వస్తుంది. దీనివల్ల స్లిప్‌లో క్యాచ్ వెళ్లే ప్రమాదం తగ్గడమే కాకుండా ప్యాడ్‌లతో బంతిని సులువుగా ఎదుర్కొనే వెసులుబాటు లభించింది.

ఎక్కువమంది చదివింది: Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

అంతటితో ఆగకుండా అవతలి వైపు నుంచి కుడిచేతి స్పిన్నర్ బి. విజయకృష్ణ బౌలింగ్‌కు రాగానే గవాస్కర్ మళ్లీ కుడిచేతి బ్యాటర్‌గా మారిపోయేవారు. రఘురామ్ భట్ ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తూ దాదాపు గంటకు పైగా క్రీజులో నిలబడ్డారు. నాటౌట్‌గా 18 పరుగులు చేస్తూ మరో బ్యాటర్ గులామ్ పార్కర్‌తో కలిసి మ్యాచ్ ముగిసే సమయానికి ముంబై స్కోరును 218/9 వద్ద నిలబెట్టారు. ముంబై ఓటమిని దాదాపు ఖాయం చేసుకున్న కర్ణాటక ఆశలపై నీళ్లు చల్లారు.

కోపంతో కాదు.. జట్టును కాపాడుకోవడానికే..!

తరువాతి కాలంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ ఆ రోజుటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘ఆ పిచ్‌పై బంతి విపరీతంగా తిరుగుతోంది. రఘురామ్ భట్ బౌలింగ్‌ను కుడిచేతితో ఆడటం అసాధ్యంగా అనిపించింది. నేను కుడిచేతితో ఆడితే అవుట్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. అందుకే ఎడమచేతితో ఆడితే బంతి శరీరాన్ని లేదా ప్యాడ్‌లను మాత్రమే తాకుతుంది తప్ప వికెట్ పడే అవకాశం ఉండదని భావించాను’ అని చెప్పారు.

వాడు బుడ్డోడు కాదయ్యా, ఆటమ్‌బాంబ్.. నేను బౌలింగ్ చేయాల్సి వస్తే..: బ్రెట్ లీ షాకింగ్ కామెంట్స్

చాలామంది అది కోపంతో లేదా నిరసనతో చేసిన పనిగా భావించారని, కానీ అందులో ఎలాంటి కోపం లేదని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్ ఫలితం ఇప్పటికే తేలిపోయినందున జట్టు కోసం ఆ ప్రయోగం చేశానని తెలిపారు. ఒకవేళ మ్యాచ్ సమవుజ్జీగా ఉండి ఉంటే తాను అటువంటి ప్రయోగం జోలికి వెళ్లేవాడిని కాదని, కేవలం రఘురామ్ భట్ బౌలింగ్‌లో మాత్రమే ఎడమచేతితో ఆడానని లిటిల్ మాస్టర్ వివరించారు.

ఈ సంఘటన భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైనదిగా నిలిచిపోయింది. మైదానంలో ప్రత్యర్థి వ్యూహాలను దెబ్బతీయడానికి బ్యాటర్లు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారనడానికి గవాస్కర్ ప్రదర్శించిన ఈ సమయస్ఫూర్తి ఒక నిదర్శనం. ఆధునిక క్రికెట్‌లో స్విచ్ హిట్లు, రివర్స్ స్వీప్‌లు సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో, నలభై ఏళ్ల క్రితమే గవాస్కర్ ప్రదర్శించిన ఈ మైండ్ గేమ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us