Brahmam Okkate Song: ఇంటర్నేషనల్ స్టేజీపై బ్రహ్మమొక్కటే కీర్తన.. వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!
అంతర్జాతీయ వేదికపై అన్నమాచార్యుల ‘బ్రహ్మమొక్కటే’ కీర్తన మార్మోగింది. ఎలాంటి సంగీత వాయిద్యాలు లేకుండా అకాపెల్లా స్టైల్‌లో అమెరికన్ మ్యూజిక్ గ్రూప్ ‘చాంటిక్లియర్’ ఆలపించిన ఈ గీతం ఇప్పుడు నెట్టింట గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు పాటలు, భక్తి కీర్తనలు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తే ఆ అనుభూతే వేరు. మన సంస్కృతి, సంగీత గొప్పతనం ప్రపంచానికి చాటినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు మరోసారి అలాంటి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. అన్నమాచార్య కీర్తన అంతర్జాతీయ వేదికపై మార్మోగడమే ఇందుకు కారణం. అన్నమయ్య సంకీర్తనల్లో ‘బ్రహ్మమొక్కటే’ గీతానికి ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా విన్నా ఎంతో ప్రశాంతంగా, భక్తిభావంతో పులకించిపోయే ఈ పాట.. ఇంటర్నేషనల్ స్టేజీపై వినిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా అంతర్జాతీయ వేదికపై జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రఖ్యాత అమెరికన్ మ్యూజిక్ గ్రూప్ ‘చాంటిక్లియర్’ ఈ ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనను ఆలపించి అందరినీ ఆకట్టుకుంది.
గ్రామీ అవార్డు విజేతగా నిలిచిన ‘చాంటిక్లియర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న సంగీత బృందం. ఈ బృందంలో కీలక గాయకుడిగా ఉన్న వినీల్ గరిసా తెలుగు మూలాలు ఉన్న యువకుడు కావడం విశేషం. ఆయన తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడగా, వినీల్ అక్కడే పుట్టి పెరిగారు. అంతేకాదు, చాంటిక్లియర్ గ్రూప్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మూలాలు ఉన్న గాయకుడిగా వినీల్ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనను వాయిద్య సంగీతంతో వినడమే ఒక గొప్ప అనుభూతి. అలాంటిది చాంటిక్లియర్ బృందం ఎలాంటి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేకుండా కేవలం గాత్రంతోనే ఈ గీతాన్ని ప్రదర్శించి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ కర్ణాటక సంగీత బాణీలో కాకుండా, విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘అకాపెల్లా’ శైలిలో ఈ పాటను పాడారు.
అకాపెల్లా అంటే ఎలాంటి సంగీత వాయిద్యాలు ఉపయోగించకుండా.. కేవలం గొంతు, నోటితో వచ్చే విభిన్న శబ్దాలు, లయలతో పాడే ప్రత్యేక పద్ధతి. ఇదే స్టైల్‌లో అన్నమాచార్య కీర్తనను చాంటిక్లియర్ బృందం ఆలపించడంతో వీడియో చూసిన వారందరికీ గూస్‌బంప్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శనపై వినీల్ గరిసా స్పందిస్తూ తన సంగీత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు విన్న పాటలే తనలో సంగీతం పట్ల ఆసక్తిని పెంచాయని, అవే తన ప్రయాణానికి పునాది వేశాయని తెలిపారు. తన బృందంతో కలిసి ‘బ్రహ్మమొక్కటే’ వంటి గొప్ప కీర్తనను ఆలపించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వినీల్ పేర్కొన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
