AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌నినో ముప్పు.. ఈ ఏడాదికి ఈ పంటలే బెస్ట్.. రేటుకు రేటు, ప్రభుత్వం హామీ

ఎల్‌నినో ముప్పు.. ఈ ఏడాదికి ఈ పంటలే బెస్ట్.. రేటుకు రేటు, ప్రభుత్వం హామీ

Phani CH
|

Updated on: Jun 04, 2026 | 4:10 PM

Share

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను ప్రోత్సహిస్తోంది. రైతులకు ఉచిత విత్తనాలు, భారీ రాయితీలు, పంట కొనుగోలు హామీలతో ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లించే కార్యాచరణను అమలు చేయనుంది.

ఖరీఫ్‌ మొదలైంది.. ఎల్‌నినో ప్రభావమూ కనిపిస్తోంది. అయితే ఈసారి రైతులకు, వ్యవసాయ రంగానికి వాతావరణ శాఖ ఒక పెద్ద హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది వర్షాకాలంపై ‘ఎల్‌నినో’ ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉందని, సెప్టెంబరు, అక్టోబరు వరకు వర్షాభావ పరిస్థితులు ఎదురుకావచ్చని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, సాగునీటిని పొదుపుగా వాడుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర గడ్డు పరిస్థితులు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి వంటి పంటల సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే వర్షాధార పంటలను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ఒక భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రణాళిక, రైతులకు అందే రాయితీలు, పంటల మార్పిడి వ్యూహాలు.. ఇవన్నీ ఇప్పుడు కీలకం కానున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలోని కృషి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలోనే అత్యవసర సాగు ప్రణాళికలను సిద్ధం చేయాలి. ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలి. కరవును తట్టుకునేలా, తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే ధ్రువీకృత విత్తనాలను రైతులకు సకాలంలో అందించాలి. రిజర్వాయర్లలోని నీటిని అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకునేలా చర్యలు చేపట్టాలి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వరి సాగుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోర్ బావుల కింద, కాలువల కింద వరి వేసే భూములను గుర్తించి, అక్కడ తక్కువ పెట్టుబడి, తక్కువ కాలపరిమితి గల పప్పుధాన్యాలు , నూనెగింజల పంటలను వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో బోర్ల కింద సాగయ్యే 86,000 ఎకరాలను గుర్తించి, అక్కడ వరికి ప్రత్యామ్నాయంగా నూనెగింజలు, మినుము వంటి పంటలను ప్రోత్సహిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 34,000 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 31,335 ఎకరాలను గుర్తించారు. ఇక్కడ మినుము సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు. కాలువల కింద నీటి లభ్యత తగ్గనుండడంతో 11 జిల్లాల పరిధిలోని 1.54 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయనున్నారు. ఇందుకోసం నంద్యాల జిల్లాలో 54,655 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 26,000 ఎకరాలు, ఏలూరు జిల్లాలో 26,600 ఎకరాలను గుర్తించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సుమారు 15,375 ఎకరాల్లో రైతులను పొగాకు సాగు నుంచి లాభదాయకమైన పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం భారీగా సబ్సిడీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా వరి కోతల తర్వాత సాగు చేపట్టడానికి, చేలగట్లపై పండించేందుకు 59,840 ఎకరాల్లో విత్తన కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి 100% రాయితీ ఇవ్వనుంది. సుమారు లక్ష ఎకరాలకు కంది, మినుము, శనగ విత్తనాలను 50% రాయితీపై పంపిణీ చేయాలని ప్రణాళికను సిద్ధం చేశారు. పల్స్‌ మిషన్‌ ద్వారా రైతులు పండించిన కందులు, మినుములను 100% సేకరిస్తామని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నూనెగింజల కొరతను అధిగమించడానికి, విలువ ఆధారిత క్లస్టర్ల పరిధిలో నూనెగింజల పంటల సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. 59,375 ఎకరాల్లో వేరుశనగ, 7,500 ఎకరాల్లో నువ్వులు, 2,500 ఎకరాల్లో సోయాబీన్స్‌, 2,500 ఎకరాల్లో ఆముదం వంటి పంటలకు విత్తనాలను 100 శాతం రాయితీపై రైతులకు అందిస్తారు. అంతేకాకుండా, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించడం ఎలా అనే అంశంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్లస్టర్ పరిధిలోకి రాని ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో ‘రైతుక్షేత్ర పాఠశాలల’ను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా సాగు పద్ధతులను వివరిస్తారు. ఎల్‌నినో అనేది ప్రకృతి విసిరిన సవాల్. వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు సాంప్రదాయకంగా వేసే వరి పంట వైపు వెళ్తే పెట్టుబడి నష్టపోవడమే కాకుండా, నీరందక పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ముందుచూపుతో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును తెరపైకి తెచ్చింది. ఉచిత విత్తనాలు, సబ్సిడీలు, పండించిన పంటను ప్రభుత్వమే కొంటుందనే హామీ ఉండడం వల్ల రైతులు ఈ ఖరీఫ్‌లో ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం ఉత్తమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?

ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ

వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు

నెలకు రూ.90 వేల జీతం.. నెలవారీ ఖర్చు రూ.25 వేలు.. రూ.65 వేలు ఆదా.. ఈ ప్లాన్ చూడండి!

Upasana Konidela: త్రిషకు మెగా కోడలి సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Follow Us