AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‎లో ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు..

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3 రోజులపాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మేజిక్‌ ఫిగర్‌ చేరుకోకపోయినా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఎలిమినేట్‌ కావడంతో మల్లన్నను విజయం వరించింది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది. మూడు రోజులపాటు కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది.

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‎లో ఉత్కంఠకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు..
Mallanna
Srikar T
|

Updated on: Jun 08, 2024 | 6:27 AM

Share

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3 రోజులపాటు ఉత్కంఠంగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మేజిక్‌ ఫిగర్‌ చేరుకోకపోయినా.. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఎలిమినేట్‌ కావడంతో మల్లన్నను విజయం వరించింది. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల పోరు ఆసక్తికరంగా సాగింది. మూడు రోజులపాటు కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉపఎన్నిక బరిలో నిలిచారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో మొత్తం 4.63 లక్షల ఓట్లు ఉండగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్‌ఎస్‌ రాకేష్‌రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న18 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అయితే ఇందులో అభ్యర్థులు ఎవరూ గెలుపు కోటాను చేరుకోలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులో మల్లన్న, రాకేష్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తర్వాత మల్లన్నకు లక్షా 46వేల 366 ఓట్లు రాగా, రాకేష్‌రెడ్డికి లక్షా 31వేల 674 ఓట్లు వచ్చాయి. దాంతో మేజిక్‌ ఫిగర్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న చేరువయ్యాడు. రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాకేష్‌రెడ్డిని కూడా ఎలిమినేట్‌ చేయడంతో మల్లన్న విజయం ఖరారైంది.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తన విజయానికి కృషిచేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మల్లన్న కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతికంగా ఓడిపోయినా.. నైతికంగా తానూ గెలిచానంటున్నారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి. మొత్తానికి ఉత్కంఠ పోరులో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపు అమరవీరులకు అంకితమన్నారు మల్లన్న.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..