AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మరో రెండు గ్యారంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Telangana: మరో రెండు గ్యారంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
Cm Revanth
Prabhakar M
| Edited By: Srikar T|

Updated on: Feb 22, 2024 | 6:36 PM

Share

గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ లేదా 29వ తేదీన ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలుగా గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.

ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ. 500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనుమానాలు, అపోహాలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. అందుకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ ఫ్లెక్సీల ద్వారా తగినంత ప్రచారం కూడా చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..