AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itlu Mee Niyojakavargam: వారసుడికి కోరుట్ల కొంగుబంగారమా.. కొట్లాటలో జనం ఎవరి వైపు.. విజయంపై విశ్లేషణ..

కోరుట్లలో ఈసారి కొట్లాట ఎవరి మధ్య?బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటులో వారసుడు తలపడతాడా?కాంగ్రెస్‌కు ఈసారైనా పట్టు దొరుకుతుందా?హిందుత్వ ఓట్లపై బీజేపీ గురిపెట్టిందా? అసలు వరుసగా గెలుస్తున్న బీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు... ఎంత వరకు అమలు చేశారు... ప్రతిపక్ష పార్టీలు ఎమని చెబుతున్నాయి.. ఒక్కసారి... ఇట్లు కోరుట్ల నియోజకవర్గం గురించి తెలుసుకుందాం..

Itlu Mee Niyojakavargam: వారసుడికి కోరుట్ల కొంగుబంగారమా.. కొట్లాటలో జనం ఎవరి వైపు.. విజయంపై విశ్లేషణ..
Koratla Constituency
Sanjay Kasula
|

Updated on: Feb 10, 2023 | 6:47 PM

Share

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రాజకీయంలో ఈసారి పక్కా చేంజ్‌ ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. 2009లో నియోజకవర్గం ఏర్పడిన కాణ్నుంచి.. వరుసబెట్టి విజయాలు సాధిస్తున్న కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.. ఈసారి ఎన్నికల బరిలో ఉండబోరన్న వార్త లోకల్‌ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అదేంటి.. ఎప్పుడో హ్యాట్రిక్‌ దాటేసి.. గత ఎన్నికల్లోనూ బంపర్ విక్టరీ దక్కించుకుని.. ఇప్పుడు మరో విజయానికి సిద్ధమవ్వాల్సిన వేళ.. ఆయనపై ఎందుకిలాంటి ప్రచారం జరుగుతోందనే అనుమానం రావొచ్చు. కాకపోతే, అది తప్పుడు ప్రచారమేం కాదు.. వచ్చేసారి వారసుణ్ని బరిలో దించేందుకు ఆయన సైడెపోతున్నారట. దీనిపై దాదాపుగా తుదినిర్ణయం జరిగిపోయినట్టు కూడా తెలుస్తోంది.

ఇప్పటికే విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ … ఫీల్డులో పని మొదలెట్టేశారు. సంవత్సర కాలంగా అటు క్యాడర్‌లో.. ఇటు జనాల్లో తిరుగుతూ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వృత్తిరిత్యా వైద్యుడు కావడంతో… ఇప్పటికే నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలవంటి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ… దూసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి పార్టీలో అయితే అసంతృప్తి జాడలేదు. ఈసారి పోటీచేయాలని లోలోపల ఎవరైనా భావించినా… విద్యాసాగర్‌రావు కుమారుడు బరిలో ఉండటంతో అంతా సైలెంటైనట్టు తెలుస్తోంది.

గెలుపుకోసం పరితపిస్తున్న విపక్షం

2009 నుంచి వరుసగా ఇక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్న విద్యాసాగర్‌కు… నియోజకవర్గంలో మంచి పట్టే ఉంది. నాలుగు దఫాలుగా ఇక్కడ విజయం కోసం పరితపించడం ప్రతిపక్షం వంతవుతోంది. 2009, 2014 ఎన్నికల్లో జువ్వాడి రత్నాకర్‌రావు… 2014, 2018 ఎన్నికల్లో ఆయన కుమారుడు జువ్వాడి నర్సింగరావులను ఓడించి…. విజయబావుటా ఎగరేశారు విద్యాసాగర్‌. మరి, ఈ దఫా బీఆర్‌ఎస్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులోనూ వారసుడి ఎంట్రీ ఖాయమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రజాతీర్పు ఎలా ఉంటుందన్న సంశయం అధికార పార్టీని వెంటాడుతోంది. అయితే, ప్రజామద్దతు తమకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు.

ఇవి కూడా చదవండి

మూడువర్గాల మధ్య మూడుముక్కలాట

అధికార పార్టీలో అంతా సవ్యంగా ఉంటే… విపక్షంలో మాత్రం విపరీతమైన వింత దోరణి కనిపిస్తోంది. విపక్ష నేతల మధ్య విభేదాలు… అధికార పార్టీకి మరోసారి అనుకూల పరిస్థితులు ఏర్పడేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోరు మీద కనిపిస్తున్న బీజేపీకి.. అంతర్గత కలహాలే కళ్లెం వేసేట్టున్నాయి. ఇక్కడ చాలామంది నేతలు కాషాయ టిక్కెట్‌ కోసం ఆశలు పెట్టుకోవడమే దీనికి ప్రధానకారణం. ఇక్కడ మూడు వర్గాల మధ్య మూడుముక్కలాట నడుస్తోంది. టికెట్ తమదంటే తమదంటూ.. ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో, కాషాయదళంలో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ అయ్యింది.

కర్చిఫ్ వేస్తున్న గత ఎన్నికల క్యాండేట్‌ 

కారును వదిలి, ఈటెలతో కలిసి కమలం గూటికి చేరిన తుల ఉమ…. ఇటీవలే పార్టీలో చేరిన సురభి నవీన్‌కుమార్‌.. మరో మహిళానేత సునీత… కోరుట్ల బీజేపీ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఎవరిస్థాయిలో వాళ్లు.. ప్రయత్నాలూ మొదలెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పువ్వుగుర్తుపై పోటీచేసి ఓడిన వెంకట్‌… మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. లేదంటే, తన భార్యకైనా టికెట్ ఇవ్వాలని… హైకమాండ్‌కు విన్నవించుకుంటున్నారు. దీంతో, నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మరో ఇద్దరు నేతలు సైతం.. కాషాయ టిక్కెట్‌రేసులోకి వచ్చిచేరడం… కొత్త కుంపటి రాజేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనకుంటున్న బీజేపీకి… ఇంటర్నల్‌ ఇష్యూస్‌ మైనస్‌గా మారుతున్నాయి.

కాంగ్రెస్‌లోనూ ముదిరిన టికెట్‌ వార్‌

అసలే అల్లకల్లోలంగా కాంగ్రెస్‌లోనూ… కోరుట్ల ఇలాఖాలో కొట్లాటలకు కొదవలేదు. టిక్కెట్‌ కోసం నేతలు బాహాబాహికి దిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన పార్టీ.. ఇప్పుడు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. గత రెండుదఫాలు ఓడిన జువ్వాడి నర్సింగరావు… మరోసారి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే, మాజీ ఎంఎల్ఎ కొమురెడ్డి రాములు.. ఆయన తనయుడు కొమురెడ్డి కరమ్‌.. సుజిత్ రావ్‌లు కూడా టిక్కెట్‌ రేసులో ఉన్నారు. అధిష్టానం దగ్గర తమ పరపతిని ఉపయోగించి… ఈసారి పోటీలో దిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జువ్వాడి నర్సింగరావు, కొంరెడ్డి రాములు మధ్య వార్‌ పీక్స్‌కు చేరింది. ఒకే పార్టీలో ఉంటూనే… బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు ఇద్దరు నేతలు. ఎలక్షన్స్‌లో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఏమోగానీ… ఈ టిక్కెట్ల లొల్లి విపక్షాల్లో పెద్ద ఇష్యూగా మారుతోంది. అయితే, నర్సింగరావు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ రచ్చే.. ఇప్పుడు అధికార పార్టీకి బలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే, అధికార పార్టీని ఈసారి అడ్డుకుని తీరుతామనే ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు లోకల్‌గా విపక్షనేతలు. త్రిముఖ పోరు ఉంటే.. తమకు అనుకూలమైన రిజల్ట్ ఉండొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

గెలుపోటముల్ని నిర్దేశిస్తున్న పద్మశాలి, ముస్లిం ఓట్లు

దాదాపు 2లక్షల 24వేల మంది ఓటర్లున్న కోరుట్లలో… ముస్లిం మైనార్టీలు, ఎస్సీలు ఎక్కువ. ఆ తర్వాత సంఖ్యలో పద్మశాలీ, మున్నురుకావు, గీత కార్మికులు, రెడ్డి ఓటర్లు ఉన్నారు. ఫైనల్‌గా పద్మశాలి, ముస్లిమ్ ఓట్లే ఇక్కడ గెలుపోటముల్ని నిర్దేశిస్తాయి. కోరుట్ల, మెట్‌పల్లిలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటే… రూరల్‌ ఏరియాలో మాత్రం మున్నురు కాపులు, గీత కార్మికులు, రెడ్లు ఎక్కువున్నారు. గత ఎన్నికల్లో బీసీలు, మైనార్టీలు గులాబీ జెండా ఎత్తుకోవడంతో… విజయం విద్యాసాగర్‌ను వరించింది. ఇక్కడ ఎక్కువగా ఉన్న ముస్లిం మైనార్టీలను దృష్టిలో పెట్టుకుని… హిందుత్వ కార్డును బయటకు తీసింది బీజేపీ. కులాల సంగతి పక్కనపెట్టి.. హిందువుల ఓట్లపై గురిపెట్టింది. అయితే, అంతకంతకూ తమ దూరమవుతున్న మైనార్టీలను దువ్వేపనిలో బిజీగా ఉంది కాంగ్రెస్‌ పార్టీ.

అభివృద్ధిపై ఎవరి వెర్షన్‌ వారిదే!

ఈ గులాబీ కోటలో అభివృద్ధికి గురించి ఆరా తీస్తే… కొందరి నుంచి బాగుందనీ, కొందరి నుంచి బాలేదనీ… సమాధానం వినిపిస్తోంది. షరామామూలుగానే ప్రతిపక్షాలు.. అసలు అభివృద్ధన్నదే లేదని విమర్శిస్తుంటే… అధికార పక్షం మాత్రం సింపుల్‌గా కొట్టిపారేస్తోంది. అభివృద్ధి అంటే ఏవిటో చేసి చూపించామంటోంది.

పూర్తిగాని ప్రధాన బిడ్జిలు, తీరని ముంపు గ్రామాల సమస్య

ఎమ్మెల్యే సాబ్‌ ఎన్ని హామీలిచ్చారన్నది పక్కనపెడితే… ఇక్కడ చాన్నాళ్లుగా ప్రధానంగా ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కీలకమైన బ్రిడ్జ్‌లు… ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. గోదావరికి సమీపంలో ఉన్న గ్రామాల్లో… ముంపు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎన్నికలప్పుడు బాగా వినిపించిన మినీ ట్యాంక్‌బండ్‌ ముచ్చట.. ఇప్పుడు ఊసే లేదు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తామన్న వాగ్దానమూ ఒట్టిదే అయ్యింది.దీంతో చెరుకు సాగుచేసినా.. అమ్ముకోవడం రైతులకు కష్టమైపోతోంది. దీంతో, చాలామంది ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లుతున్నారు.

గల్ఫ్‌బాధితుల కన్నీళ్లు తుడిచేదెప్పుడు?

కోరుట్ల అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది బీడీ కార్మికులు. వారి విషయంలో ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ… ఇక్కడ ఎమ్మెల్యేకు పాజిటివ్‌ టాక్‌ను తెచ్చిపెట్టింది. వారికి ఫించన్లు, ఆస్పత్రి ఏర్పాటు.. సిట్టింగ్‌కు పేరుతెచ్చింది. అయితే, ఇక్కణ్నుంచి ఉపాధి కోసం వేల సంఖ్యలో గల్ఫ్‌ కంట్రీస్‌కు వెళ్లి… అక్కడ కూడా పనిదొరక్క వెనక్కి వస్తున్నవారికోసం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదన్న అపవాదు ఎమ్మెల్యేను వెంటాడుతోంది. అయితే, దాదాపు అన్ని హామీలను అమలు చేశాననీ.. మిగిలినవి మరికొన్ని రోజుల్లో పూర్తిచేస్తామనీ చెబుతున్నారు ఎమ్మెల్యే.

ఎవరివాదన వారిదే.. ఎవరి ధీమా వారిదే… మరి, కోరుట్ల జనం కోరుకుంటున్నదెవరిని? ఎమ్మెల్యేగా ఐదోసారి కల్వకుంట్ల కుటుంబానికే ఛాన్సిస్తారా? ఇకచాలని, మరో నేతకు అవకాశం ఇస్తారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో!

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం