AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. మెట్రో విస్తరణపై ముందడుగు.. మూడో దశపై క్లారిటీ

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్. మెట్రో మూడో దశ విస్తరణకు ముందడుగు పడింది. రెండో దశలో 152.5 కిలోమీటర్ల మేర నిర్మించనుండగా.. మూడో దశలో 178 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. మూడో దశలో శివారు ప్రాంతాల వరకు మెట్రో సేవలు ఏర్పాటు చేయనున్నారు.

Hyderabad Metro: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. మెట్రో విస్తరణపై ముందడుగు.. మూడో దశపై క్లారిటీ
Hyderabad Metro
Venkatrao Lella
|

Updated on: Dec 22, 2025 | 12:23 PM

Share

Hyderabad: హైదరాబాద్ మెట్రో విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, డిజైన్ రూపకల్పన, నిధుల కేటాయింపుల్లో స్పీడ్ పెంచుతోంది. నగరానికే పరిమితం కాకుండా శివారు ప్రాంతాలకు కూడా మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. శివారు ప్రాంతాల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం వేలమంది సిటీలోకి వస్తుంటారు. ప్రస్తుతం అలాంటివారు బస్సులనే ఆశ్రయిస్తున్నారు. శివారు ప్రాంతాలకు ఎక్కువగా బస్సులు అందుబాటులోలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ బస్సులు మారాల్సి వస్తుంది. అంతేకాకుండా ట్రాఫిక్‌తో మరింత అవస్థలు పడుడుతున్నారు. దీంతో మూడో దశ విస్తరణలో భాగంగా శివారు ప్రాంతాలకు కూడా మెట్రో సేవలు కల్పించేలా చర్యలు చేపట్టింది.

తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా మెట్రో మూడో దశ విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా 178.3 కిలోమీటర్ల మేర మెట్రో సేవలనును శివారు ప్రాంతాల వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయనుంది. మేడ్చల్, పటాన్ చెరువు, ఘట్‌కేసర్, హయాత్ నగర్, శామీర్ పేట్ వంటి నగర శివారు ప్రాంతాల వరకు మెట్రో సేవలను విస్తరించనుంది. 2047 నాటికి ఇవి పూర్తి చేయలనే లక్ష్యం పెట్టుకుంది. అన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యం కల్పిస్తే ఐటీ కారిడార్లు, ఎయిర్‌పోర్ట్‌కు నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం విస్తరించింది. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏడాది 15 కిలోమీటర్ల మెట్రో ట్రాక్‌లను నిర్మిస్తే 2047 నాటికి 400 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకా 330.8 కిలోమీటర్లు విస్తరించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల్లో జాప్యం, నిధుల కొరత వల్ల మెట్రో విస్తరణలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రకియలు వేగవంతమైతే మెట్రో విస్తరణ పనులు శరవేగంగా ప్రారంభమయ్య అవకాశముంది. ఇప్పటికే మెట్రోను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే టేకోవర్ ప్రాసెస్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి కానుంది. ఆ తర్వాత మెట్రో విస్తరణ పనులు స్టార్ట్ అయ్యే అవకాశముంది. మెట్రో విస్తరణ మొత్తం పూర్తయితే శివారు ప్రాంతాాల నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సిటీలోకి చేరుకోవచ్చు. ఇప్పుడు బస్సు ద్వారా గంటల కొద్ది సమయం పడుతుంది. శివారు ప్రాంతం నుంచి సిటీలోకి రావాలంటే రెండు గంటల వరకు సమయం పడుతుంది. అదే మెట్రో పూర్తయితే ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గనుంది.