Chicken Prices: పండుగల వేళ సామాన్యులకు షాక్.. కొండెక్కిన కోడి గుడ్లు, చికెన్ ధరలు.. ఒకేసారి భారీగా..
Eggs Price: ఒకవైపు గుడ్లు.. మరోవైపు చికెన్.. వీటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులోకి వెళ్తున్నాయి. పండుగల సమయంలో సామాన్యుల జేబుకు చిల్లలు తప్పడం లేదు. సామాన్యులకు తక్కవ ధరలో అందుబాటులో ఉంటే వీటి ధరలు పెరగడం వారికి భారం కానుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్లు, చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే..

నాన్‌వెజ్ ప్రియులకు ఇది బ్యాడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే కోడి గుడ్ల ధరలు పెరుగుతోండగా.. దానితో పాటు చికెన్ ధరలు కూడా భగ్గుముంటున్నాయి. త్వరలో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి లాంటి ప్రధాన పండుగలు వస్తుండటంతో వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కారణంగా చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. దాణా ఖర్చులు పెరుగడంతో కోళ్ల ఫామ్స్ నిర్వహణ కూడా యజమానులకు కష్టంగా మారిపోయింది. దీంతో ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. గుడ్లు, చికెన్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇంటి ఖర్చు పెరుగుతోంది. దీంతో పండుగ వేళ సామాన్యులకు భారం తప్పడం లేదు. మరికొన్ని రోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.
నెల క్రిందట గుడ్డు ధర రూ.5 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.3 పెరిగి రూ.8కి చేరుకుంది. హోల్‌సెల్ మార్కెట్లో రూ.7.50గా ఉండగా.. రిలైలర్లు రూ.8కి విక్రయిస్తున్నారు. ఇక నాటుకోడి గుడ్డు ధర రూ.15 పలుకుతోంది. ఇక వీటితో పాటు చికెన్ ధరలు కూడా ఆమాంతం పెరిగాయి. నెలలోనే రూ.100 మేర కేజీ చికెన్ ధర పెరిగింది. నెల క్రితం రూ.190 నుంచి రూ.200 మధ్య కేజీ చికెన్ ధర కొనసాగింది. ఈ నెల ప్రారంభంలో రూ.230 వరకు చేరుకోగా.. ఆదివారం నాటికి రూ.290కి చేరుకుంది. దీంతో నెల రోజుల్లో రూ.100 మేర చికెన్ ధర పెరిగినట్లయింది. పండుగల సీజన్ కావడంతో చికెన్‌కు ఫుల్ డిమాండ్ పెరగడం, డిమాండ్‌కు తగ్గట్లు కోళ్ల ఫామ్స్ నుంచి కోళ్లు రాకపోవడంతో ధరలు పెంచుతున్నారు.
ఇక కోళ్లకు వేసే దాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అలాగే ఇతర ఖర్చులు కూడా పెరగడంతో చికెన్ ధరలు పెంచాల్సి వస్తోందని యజమానులు చెబుతున్నారు. అసలే త్వరలో పండుగల సీజన్ వస్తుండటంతో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ సమయంలో రేట్లు పెరగడం సామాన్యులకు భారం కానుందని చెప్పవచ్చు. మరో నెల రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉంటుందని పాల్ట్రీ ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.




