- Telugu News Business The Railway Ministry has decided to increase train ticket fares from December 26
Indian Railway: ప్రయాణికులకు ఒక్కసారిగా షాకిచ్చిన రైల్వేేశాఖ.. టికెట్ల ధరలు పెంపు.. ఎంతంటే..?
త్వరలో పండుగల సీజన్ క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. టికెట్ల ధరలను స్వల్పంగా పెంచింది. సెకండ్ క్లాసుతో పాటు ఏసీ, నాన్ ఏసీ టికెట్ల ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి పెంచిన ధరలు అమలు చేయనున్నారు.
Updated on: Dec 22, 2025 | 1:51 PM

ప్రయాణికులకు రైల్వేశాఖ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సెకండ్ క్లాస్, ఏసీ, నాన్ ఏసీ టికెట్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 26 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఏ రైళ్లల్లో ఎంతవరకు పెంచారు..? ఏ క్లాసుల్లో ఎంతవరకు పెరిగింది? అనే విషయాలు చూద్దాం.

సెకండ్ క్లాస్‌లో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణంపై టికెట్ల పెంపు లేదు. ఇక అంతకు మించి చేసే ప్రయాణాలకు సెకండ్ క్లాస్‌లో కిలోమీటర్‌కు 1 పైసా పెంచారు. ఇక మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్‌కు 2 పైసలు పెంచారు.

ఇక నాన్ ఏసీ కోచుల్లో 500 కిలోమీటర్ల ప్రయాణంపై రూ.10 పెంచుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అయితే సబర్బన్ రైళ్లల్లో టికెట్ల పెంపు లేదు. ఈ ఛార్జీల పెంపు వల్ల రైల్వేలకు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.600 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది.

కొత్తగా వందే భారత్, వందే భారత్ స్లీపర్‌తో పాటు అమృత్ భారత్ వంటి అత్యాధునిక రైళ్లను కేంద్రం తీసుకొస్తుంది. వీటి తయారీకి చాలా ఖర్చవుతుంది. రైల్వే ట్రాక్‌ల విస్తరణ, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం, ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాలు, ఉద్యోగుల జీతాలకు రైల్వేశాఖ ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తోంది.

ఉద్యోగుల కోసం రూ.1.15 లక్షల కోట్లు రైల్వేశాఖ ఖర్చు చేస్తోంది. ఇక పెన్షన్ల కోసం రూ.60 వేల కోట్లు అవ్వుతున్నాయి. వీటి వల్ల గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2.63 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఛార్జీలు స్వల్ప మొత్తంలో పెంచాల్సి వచ్చిందని రైల్వేశాఖ వెల్లడించింది.




