BSR: ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కీలక సూచనలు చేసిన గులాబీ దళపతి..

బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షత మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై..

BSR: ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కీలక సూచనలు చేసిన గులాబీ దళపతి..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 29, 2023 | 7:32 PM

రాజ్‌భవన్‌ వర్సెస్ ప్రగతిభవన్ ఎపిసోడ్‌ పార్లమెంట్‌లోనూ ప్రకంపనలు రేపనుంది. గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలు, కేంద్రం వైఖరిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కలిసివచ్చే పార్టీలతో ఉభయ సభల్లోనూ కేంద్రాన్ని నిలదీయాలంటూ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి కేసీఆర్.

కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకే డిసైడ్ అయింది బీఆర్ఎస్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనే వేదికగా మార్చుకోవాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్రం ప్రజల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆరోపించారు కేసీఆర్. అదానీ వంటి బడా వ్యాపారవేత్తల కంపెనీల డొల్లతనం బయటపడుతోందని అన్నారు. లాభాలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రం.. నష్టాలను మాత్రం ప్రజల మీద రుద్దుతోందని విమర్శించారు . ఈ వైఖరిని ఖండించాలని ఎంపీలకు సూచించారు సీఎం.

బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు కేసీఆర్. ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటోందన్నారు.గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసనసభ, శాసన మండలి తీసుకున్న నిర్ణయాలను సైతం గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతున్నారని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలు, కేంద్రం వైఖరిని ప్రశ్నించాలన్నారు కేసీఆర్. బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి కలిసివచ్చే ప్రతి ఎంపీని కలుపుకొని పోవాలంటూ నేతలకు సూచించారు.

ఇవి కూడా చదవండి

ధరల పెరుగుదలపైనా కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించింది బీఆర్ఎస్. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు కేసీఆర్. సామాన్యుడి బతుకు భారమైపోతున్నా కేంద్రానికి పట్టింపులేదన్నారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. నిరుద్యోగం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపైనా గొంతెత్తనున్నారు బీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు, హక్కులపైనా రాజీలేని పోరాటం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.

కాగా, ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..