RCB vs SRH: బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి బెంగళూరు, హైదరాబాద్ ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
ఐపీఎల్ 2026 అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ, తొలి మ్యాచ్‌లో ఒక విషాద ఛాయ కనిపిస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు. గత ఏడాది జరిగిన ఒక ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత ఏడాది జూన్ 4, 2025న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు తన తొలి టైటిల్ గెలిచిన సందర్భంగా భారీ వేడుకను నిర్వహించింది. అయితే, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటనను స్మరించుకుంటూ, ప్రస్తుత సీజన్ తొలి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోని ఆటగాళ్లు, అభిమానులు అందరూ నిశ్శబ్దంగా నిలబడి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు.
స్టేడియంలో శాశ్వతంగా 11 ఖాళీ సీట్లు..
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ విషయంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రమాదంలో మరణించిన 11 మంది గుర్తుగా చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని నిర్ణయించింది. ఈ సీట్లను ఎవరికీ కేటాయించకుండా, వారి స్మృత్యర్థం అలాగే ఉంచుతారు. అంతేకాకుండా, శిక్షణ సమయంలో విరాట్ కోహ్లీతో సహా ఆటగాళ్లందరూ ’11’వ నంబర్ జెర్సీని ధరించి ప్రాక్టీస్ చేయడం విశేషం. ఈ గొప్ప సంజ్ఞను నెటిజన్లు, క్రీడాభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అట్టహాస వేడుకలు రద్దు.. భద్రతకే ప్రాధాన్యత..
గత ఏడాది జరిగిన ప్రమాదం దృష్ట్యా, బీసీసీఐ ఈసారి ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. ఎటువంటి డాన్స్ లేదా సంగీత ప్రదర్శనలు లేకుండానే టోర్నీని ప్రారంభించారు. స్టేడియంలో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేసిన తర్వాతే కర్ణాటక ప్రభుత్వం ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటమే తమ ప్రాధాన్యత అని నిర్వాహకులు స్పష్టం చేశారు.
రెండో టైటిల్ లక్ష్యంగా ఆర్సీబీ ప్రయాణం..
టాస్ సమయంలో ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ మాట్లాడుతూ, గత ఏడాది జ్ఞాపకాలు బాధిస్తున్నా, జట్టుగా తాము మళ్లీ ఛాంపియన్లుగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. “మేము దేనినీ రక్షించుకోవడానికి ఆడటం లేదు, మరోసారి కప్పు గెలవడానికే బరిలోకి దిగుతున్నాం. మా జెర్సీపై రెండో స్టార్ (రెండో టైటిల్) ఉండేలా కష్టపడతాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
