Harshit Rana : పర్ఫామ్ చెయ్, లేదంటే బయట కూర్చోబెడతా..ఆ బౌలర్‌కు స్ట్రిక్ వార్నింగ్ ఇచ్చిన గంభీర్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన చివరి వన్డే మ్యాచ్‌లో యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్, ఈ చివరి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Harshit Rana : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన చివరి వన్డే మ్యాచ్‌లో యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ప్రదర్శన అద్భుతంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్, ఈ చివరి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఈ అద్భుత ప్రదర్శన వెనుక జట్టు చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన “పర్ఫామ్ చెయ్, లేదంటే బయట కూర్చోబెడతా” అని గట్టిగా హెచ్చరించినట్లు హర్షిత్ రాణా చిన్ననాటి కోచ్ శర్వన్ వెల్లడించారు. గంభీర్ నుంచి వచ్చిన ఆ సందేశమే హర్షిత్‌ను ఉత్సాహపరిచి, అత్యుత్తమ ప్రదర్శన చేసేలా ప్రేరేపించిందని శర్వన్ తెలిపారు.
ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచిన హర్షిత్ రాణాపై సిడ్నీ వన్డేకు ముందు తీవ్ర ఒత్తిడి, విమర్శలు ఉండేవి. సీనియర్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో అతన్ని ఎంపిక చేయడంపై కూడా చర్చ జరిగింది. గంభీర్ మనిషి అని హర్షిత్‌ను చాలా మంది ట్రోల్ చేశారు. అయితే అతను ఏ విమర్శలకు బహిరంగంగా స్పందించలేదు.
ఎట్టకేలకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై 8.4 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. అతని పేస్, బౌన్స్ ముందు ఆస్ట్రేలియా 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో హర్షిత్ రాణాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన కఠినమైన సందేశమే ముందుకు నడిపించిందని అతని చిన్ననాటి కోచ్ శర్వన్ వెల్లడించారు. హర్షిత్ తనకు ఫోన్ చేసి, తన ప్రదర్శనతో బయటి విమర్శకులను ఆపాలని అనుకుంటున్నట్లు చెప్పాడని శర్వన్ తెలిపారు.
“గంభీర్ టాలెంటును గుర్తించి సపోర్టు ఇస్తారు. అయితే, అతను హర్షిత్‌ను తీవ్రంగా మందలించాడు. పర్ఫామ్ చెయ్, లేదంటే బయట కూర్చోబెడతా అని నేరుగా చెప్పేశాడు. గంభీర్ ఎప్పుడు ఎలాంటి విషయాన్ని అయినా చాలా స్పష్టంగా చెబుతారు” అని శర్వన్ వెల్లడించారు. గంభీర్ ఇచ్చిన ఈ స్పష్టమైన హెచ్చరిక హర్షిత్‌ను బాగా ఉత్సాహపరిచిందని కోచ్ తెలిపారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు హర్షిత్ రాణా సెలక్షన్ పై మాజీ క్రికెటర్ కే. శ్రీకాంత్ విమర్శలు చేశారు. హర్షిత్ గంభీర్ జీ-హుజూర్ కాబట్టే సెలక్ట్ చేశారని శ్రీకాంత్ ఆరోపించారు. దీనిపై హర్షిత్ కోచ్ శర్వన్ తీవ్రంగా స్పందించారు.
“రిటైర్మెంట్ తర్వాత చాలా మంది క్రికెటర్లు డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించారు. కానీ దయచేసి కొత్తగా వచ్చే కుర్రాడిని విమర్శించకండి. వారికి సలహా ఇచ్చే, మందలించే అధికారం ఉంది, కానీ తమ యూట్యూబ్ ఛానెల్ పాపులారిటీ కోసం అనవసరంగా మాట్లాడకండి” అని శర్వన్ అన్నారు. దీనిపై గౌతమ్ గంభీర్ కూడా గతంలో శ్రీకాంత్ చర్యను సిగ్గుచేటు అని అభివర్ణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




