Ranji Trophy History: రంజీ ట్రోఫీలో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు హ్యాట్రిక్‌లు, ఒకే రోజు 25 వికెట్లు డౌన్
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండవ రౌండ్ మ్యాచ్‌లో అస్సాం-సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన పోరులో హిస్టరీ క్రియేట్ అయింది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని అస్సాం జట్టుపై సర్వీసెస్ బౌలర్లు తమ విశ్వరూపం చూపించారు. మ్యాచ్ మొదటి రోజు కేవలం రెండు సెషన్లలోనే, ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా రెండు హ్యాట్రిక్‌లు నమోదు కావడం రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఇది మొదటిసారి.

Ranji Trophy History: రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండవ రౌండ్ మ్యాచ్‌లో అస్సాం-సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన పోరులో హిస్టరీ క్రియేట్ అయింది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని అస్సాం జట్టుపై సర్వీసెస్ బౌలర్లు తమ విశ్వరూపం చూపించారు. మ్యాచ్ మొదటి రోజు కేవలం రెండు సెషన్లలోనే, ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా రెండు హ్యాట్రిక్‌లు నమోదు కావడం రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఈ ఒక్కరోజు ఆటలో ఏకంగా 25 వికెట్లు పడిపోగా, అందులో 11 మంది బ్యాట్స్‌మెన్‌లు తమ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు.
24 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్‌ను నిర్వహిస్తున్న టిన్‌సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మైదానంలో అస్సాం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, ఈ నిర్ణయం పూర్తిగా తప్పని తేలింది. అస్సాం కేవలం 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 12వ ఓవర్ మూడో బంతికి స్టార్ ఆటగాడు రియాన్ పరాగ్ (36 పరుగులు) ఔట్ అయిన తర్వాత, సర్వీసెస్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అర్జున్ శర్మ రెచ్చిపోయాడు. అర్జున్, వికెట్ కీపర్ సుమిత్ ఘాడిగావ్కర్, సిబ్‌శంకర్ రాయ్‌లను ఔట్ చేసి, సీజన్‌లో మొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
అర్జున్ తర్వాత, అతని సహచరుడు, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ మోహిత్ జాంగ్రా ఇన్నింగ్స్‌లో రెండో హ్యాట్రిక్‌ను సాధించాడు. 15వ ఓవర్‌లో ఓపెనర్ ప్రద్యున్ సైకియా (52 పరుగులు)ను ఔట్ చేసిన తర్వాత, జాంగ్రా 17వ ఓవర్‌లో ముఖ్తార్ హుస్సేన్, భార్గవ్ లఖర్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఈ రెండు హ్యాట్రిక్‌ల దెబ్బకు అస్సాం మొదటి ఇన్నింగ్స్ 17.2 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. అర్జున్ శర్మ 5 వికెట్లు, మోహిత్ జాంగ్రా 3 వికెట్లు పడగొట్టారు.
ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ నమోదు చేయడం రంజీ ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఐదు దశాబ్దాల క్రితం 1963లో సర్వీసెస్ తరఫున ఆడిన జోగిందర్ సింగ్ రావు ఒకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అయితే, రెండు వేర్వేరు బౌలర్లు ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి.
అస్సాం 103 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ, సర్వీసెస్ జట్టు కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో తడబడింది. సర్వీసెస్ జట్టు కూడా 29.2 ఓవర్లలో కేవలం 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇర్ఫాన్ ఖాన్ (51 నాటౌట్) మాత్రమే కొంత పోరాటం చూపించాడు. అస్సాం తరఫున రియాన్ పరాగ్ 5 వికెట్లు తీసి తన జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. పరాగ్ కూడా వరుసగా నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు.
టీ బ్రేక్ సమయానికి ముందే 47 ఓవర్లలో ఇరు జట్ల మొదటి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. ఈ ఒక్క రోజు ఆటలో మొత్తం 25 వికెట్లు పడగా, అందులో ఏకంగా 11 మంది బ్యాట్స్‌మెన్‌లు డకౌట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో అస్సాం, రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. సర్వీసెస్ జట్టుపై కేవలం 51 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే అస్సాంకు లభించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




