AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడికి హైదరాబాద్‌ లింకులు

ఆస్ట్రేలియా లోని సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్‌ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్‌ అక్రమ్‌ దగ్గర భారత పాస్‌పోర్ట్‌ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్‌ స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.

సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడికి హైదరాబాద్‌ లింకులు
Sydney Bondi Beach Attack
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Dec 16, 2025 | 5:16 PM

Share

సిడ్నీ బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రదాడిగా కన్ఫామ్ చేసింది. డిసెంబర్ 14న జరిగిన ఈ దాడిలో 15 మంది పౌరులు మృతి చెందగా, దాడి చేసిన ఇద్దరిలో ఒకరు పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ , అతని కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ అని ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ISS భావజాలం ప్రభావంతో ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. సాజిద్ అక్రమ్ అసలు స్వస్థలం హైదరాబాద్ అని అక్కడి దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైంది. అతను హైదరాబాద్‌లో బీకాం పూర్తి చేసి 1998 నవంబరులో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడే యూరోపియన్ మూలాలు కలిగిన వేనేరా గ్రాసోను వివాహం చేసుకుని పర్మనెంట్‌గా సెటిల్ అయ్యారు. దంపతులకు ఒక కుమారుడు నవీద్ అక్రమ్, ఒక కుమార్తె ఉన్నారు. నవీద్, కుమార్తె ఆస్ట్రేలియాలోనే జన్మించి అక్కడి సిటిజెన్‌షిప్ పొందారు. సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గత 27 ఏళ్లలో సాజిద్ అక్రమ్ కుటుంబంతో పెద్దగా సన్నిహితంగా మెలగలేదని ఇక్కడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత ఆరు సార్లు మాత్రమే భారత్‌కు వచ్చినట్లు తెలిసింది. అవి కూడా ప్రధానంగా ఆస్తి పంపకాలు, వయసు మళ్లిన తల్లిదండ్రులను కలవడం వంటి కుటుంబ కారణాల కోసమే. తండ్రి మరణ సమయంలో కూడా ఆయన భారత్‌కు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లిన విషయంపై తమకు ఎలాంటి అవగాహన లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వారి రాడికలైజేషన్‌కు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది తమకు తెలియదని వెల్లడించారు.

సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ తీవ్రవాదంవైపు మళ్లడానికి భారత్‌ లేదా తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావాలు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. 1998లో భారత్ విడిచే వరకు సాజిద్ అక్రమ్‌పై తెలంగాణ పోలీసుల వద్ద ఎలాంటి నెగిటివ్ రికార్డులు లేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర సంస్థలు, ఇతర భద్రతా ఏజెన్సీలతో పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ధృవీకరించని సమాచారంతో ఊహాగానాలు, ఆరోపణలు చేయవద్దని ప్రజలు, మీడియాకు సూచించారు.