సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్.. లిస్ట్‌లో ఉన్నదెవరూ!
తెలంగాణలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామం ఎదురైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అధికారి పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంతగ్రామంలోనే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. దీంతో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆయా ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయినట్టు టాక్ నడుతస్తోంది.

ఎమ్మెల్యేలు రాజకీయంగా యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళ సొంత గ్రామాలలోనే ఓటమిని చవిచూశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బలపరిన అభ్యర్థులు.. బీఆర్ఎస్, ఇతర పార్టీల అభ్యర్థుల చేతితో ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యేలు స్థానిక అభ్యర్థుల ఎంపికపై సరిగ్గా దృష్టి పెట్టలేదని.. ఇప్పటికైనా వైఫల్యం ఎక్కడ జరిగిందో తెలుసుకొని.. సరిదిద్దుకోవాల్సి అవసరం ఉందనే చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై అటు అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
సొంత నియోజకవర్గంలో అభ్యర్థుల ఓటమి
ఇక సొంత నియోజకవర్గంలోనే అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిన వారి జాబితా చూసుకుంటే.. ఉమ్మడి పాలమూరు జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి.. తన పక్క ఊరు దన్వాడలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై బిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక దేవరకద్ర ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ సొంత ఊరు దమత్నాపూర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా బిఆర్ఎస్ అభ్యర్ధి 120 ఓట్లకు మెజార్టీతో కాంగ్రెస్‌పై గెలిచారు. అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో సైతం కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోయారు.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం ఇదే రకమైన పరిస్థితి ఉంది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి షాక్ ఇచ్చారు సొంతూరు ప్రజలు. ఎమ్మెల్యే సొంతూరు పచ్చు నూరులో ఒక్క ఓటుతో తేడాతో కాంగ్రెస్‌పై బిఆర్ఎస్ మద్దతుదారు సర్పంచ్‌గా గెలిచారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంతూరులో తన సోదరుడు ఓడిపోయాడు. అక్కడ బిఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్ధి గెలిచారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం దుమ్ముగూడెం మండలం బండిరేవులో సైతం కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు.
ఇలా చాలా ప్రాంతాల్లో తమ సొంత గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి ఎమ్మెల్యేలు షాక్ అవుతున్నారు. ఇక మూడవ విడతలో అయినా ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు పీసీసీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఓడిపోవడంతో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




