IPL vs PSL: ఐపీఎల్ వేలానికి ముందు పాకిస్తాన్ జిమ్మిక్స్.. పీఎస్‌ఎల్‌తో విదేశీ ఆటగాళ్లకు గాలం..
IPL 2023 Mini Auction: ఐపీఎల్ వేలానికి ముందు పాకిస్తాన్ మరో సంచలనానికి తెరలేపింది. పీఎస్‌ఎల్ కోసం 500 మంది విదేశీ ఆటగాళ్లతో ఓ లిస్ట్‌ను తయారుచేసింది.
ఐపీఎల్ వేలానికి ముందు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మరో సంచలనానికి తెరలేపింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ సిద్ధం చేసింది. PSL కోసం తయారుచేసిన ఈ డ్రాఫ్ట్‌లో 500 మంది విదేశీ ఆటగాళ్లను చేర్చింది. ఈ ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్, మొయిన్ అలీ, వానెందు హసరంగా, కీరన్ పొలార్డ్, మార్టిన్ గప్టిల్ ఉన్నారు. డిసెంబర్ 15న పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం ఆటగాళ్లు డ్రాఫ్ట్ చేయనుంది. ఈ సమయంలో ఐపీఎల్‌లో పాల్గొనే పలువురు ఆటగాళ్లు పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో పాల్గొంటారు. ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్స్..
జియో న్యూస్ జాబితా ప్రకారం, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా 138 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ ఆటగాళ్లందరూ PSL ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారు. ఇది కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 46, బంగ్లాదేశ్ నుంచి 30, న్యూజిలాండ్ నుంచి 6, దక్షిణాఫ్రికా నుంచి 26, శ్రీలంక నుంచి 62, జింబాబ్వే నుంచి 11, వెస్టిండీస్ నుంచి 40 మంది ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ రాబోయే సీజన్ కోసం నమోదు చేసుకున్నారు.
ప్లాటినం గ్రూపులో ఎవరున్నారంటే?
ప్లాటినం కేటగిరీలో ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్, షకీబ్ అల్ హసన్, అలెక్స్ హేల్స్, డేవిడ్ విల్లీ, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, జిమ్మీ నీషమ్, డేవిడ్ మిల్లర్, ఆదిల్ రషీద్, భానుక రాజపక్స, దాసున్ షనక, వనిందు హసరంగా, కీరన్ పొలార్డ్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ, మార్టిన్ గప్టిల్, లుంగి ఎన్గిడి ఉన్నారు.
డైమండ్ గ్రూపు..
పాకిస్థాన్ సూపర్ లీగ్ డైమండ్ విభాగంలో కార్లోస్ బ్రాత్‌వైట్, ఇమ్రాన్ తాహిర్, సాకిబ్ మహమూద్, జేమ్స్ విన్స్, తమీమ్ ఇక్బాల్, ముష్ఫిక్ ఉర్ రహీమ్, హజ్రతుల్లా జజాయ్, విల్ జాక్, రీజా హెండ్రిక్స్, షాయ్ హోప్ మరియు సికందర్ రజా వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు జూనియర్ డాలా, టెంబా బౌమా గోల్డ్ విభాగంలో చేరారు.
పీఎస్ఎల్ షెడ్యూల్..
పాకిస్తాన్ సూపర్ లీగ్ 9 ఫిబ్రవరి 2023 నుంచి ప్రారంభమవుతుంది. అయితే PSL ఫైనల్ 19 మార్చి 2023న జరుగుతుంది. ఈ టోర్నీ 40 రోజుల పాటు జరగనుంది. అదే సమయంలో, IPL 2023 మార్చి చివరి వారంలో ప్రారంభం కానున్నది. దీంతో IPL, PSL షెడ్యూల్ క్రాష్ కాదని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..