Mitchell Owen: ఐపీఎల్ ఒప్పందంతో మొదలైన పంచాయతీ.. PSL క్లీయరెన్స్ లేకుంటే సిక్స్ హిట్టర్ పై కిరికిరి పక్కా!
గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయంతో అతని స్థానాన్ని భర్తీ చేయడానికి పంజాబ్ కింగ్స్ మిచెల్ ఓవెన్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం PSLలో పేశావర్ జల్మీ తరఫున ఆడుతున్న ఓవెన్, IPLలో చేరడానికి ముందు తన PSL బాధ్యతలు పూర్తి చేస్తాడు. గతంలో కార్బిన్ బోష్ PSL వదిలి IPL చేరడంతో PCB అతనిపై ఏడాది నిషేధం విధించింది. అయితే ఓవెన్ మాత్రం అన్ని విధివిధానాలు పాటిస్తూ, రెండు లీగ్‌ల మధ్య సమతుల్యత కొనసాగిస్తున్నాడు.

IPL ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా అతని స్థానంలో మిచెల్ ఓవెన్‌ను ఎంపిక చేసింది. రైట్-హ్యాండెడ్ పవర్ హిట్టర్ అయిన ఓవెన్, రూ. 3 కోట్ల విలువైన IPL 2025 ఒప్పందాన్ని సొంతం చేసుకుని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, IPL మెగా వేలంలో అన్‌సోల్డ్ అయిన ఓవెన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పేశావర్ జల్మీ తీసుకుంది. ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లలో 198.04 స్ట్రైక్‌రేట్‌తో 106 పరుగులు చేశాడు. అయితే, IPL ఒప్పందం కారణంగా ఆయన PSLలో కొనసాగుతారా అనే అనుమానాలు తలెత్తాయి. కానీ ESPN Cricinfo నివేదిక ప్రకారం, మిచెల్ ఓవెన్ తన PSL బాధ్యతలు పూర్తిచేసిన తర్వాతే పంజాబ్ కింగ్స్‌కు చేరనున్నారు.
ప్రస్తుతం జల్మీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి, ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జల్మీ మే 9న తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అయితే జల్మీ ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తే, మే 18 తర్వాత మాత్రమే ఓవెన్ IPLకి చేరుతారు. ఈ పరిస్థితిలో, PCB అతనిపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదు.
కార్బిన్ బోష్‌పై PCB నిషేధం
గతంలో ముంబయి ఇండియన్స్ తరఫున IPL 2025లో ఎంపికైన కార్బిన్ బోష్, PSLను మధ్యలో వదిలేసినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతనిపై ఒక సంవత్సరం నిషేధం విధించింది. అప్పట్లో ఆయన కూడా పేశావర్ జల్మీ తరఫున ఆడుతున్నాడు. అనంతరం బోష్ క్షమాపణలు చెబుతూ, ఇకపై అలాంటి తప్పు తడచుకోనని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం బోష్ ముంబయి జట్టుకు కీలక ఆటగాడిగా మారి, తన సీమ్ బౌలింగ్‌తో పాటు దిగువ స్ధాయి బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. మిచెల్ ఓవెన్ తన PSL బాధ్యతలు పూర్తి చేసిన తర్వాతే IPLకి చేరుతుండటంతో, PCB అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశమేం కనిపించడంలేదు.
BBL ఫైనల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా మిచెల్ ఓవెన్ పేరు మీద ఉంది. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్‌లో మిచెల్ ఓవెన్ 11 సిక్సర్లు కొట్టడం ద్వారా హోబర్ట్ హరికేన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అంతేకాకుండా, బిగ్ బాష్ లీగ్ చరిత్రలో 40 బంతుల్లోపు సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా మిచెల్ ఓవెన్ చరిత్ర సృష్టిచాడు. 23 ఏళ్ల మిచెల్ 39 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును సాధించాడు. బీబీఎల్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డు కూడా మిచెల్ ఓవెన్ పేరిట ఉంది. సిడ్నీ థండర్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో మిచెల్ కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం ద్వారా ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు, బిగ్ బాష్ లీగ్‌లో రికార్డుల మీద రికార్డులు రాసిన యువ బ్యాటర్ ను పంజాబ్ కింగ్స్ జట్టు గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో ఎంపిక చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



