AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCBని వణికించిన 17 ఏళ్ల ఆయుష్‌ మ్హత్రే! అగ్రి కోలి కుటుంబంలో పుట్టి.. తండ్రి కష్టంతో రాటుదేలాడు! లైఫ్ స్టోరీ

17 ఏళ్ల ఆయుష్ మ్హత్రే, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన 94 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన క్రికెట్ ప్రయాణం, కష్టాలు, కుటుంబం నుండి వచ్చిన ప్రోత్సాహం, అతని విజయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

RCBని వణికించిన 17 ఏళ్ల ఆయుష్‌ మ్హత్రే! అగ్రి కోలి కుటుంబంలో పుట్టి.. తండ్రి కష్టంతో రాటుదేలాడు! లైఫ్ స్టోరీ
Ayush Mhatre
SN Pasha
|

Updated on: May 04, 2025 | 7:26 PM

Share

శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులంతా చూసే ఉంటారు. మ్యాచ్‌ చివరి బాల్‌ వరకు నరాలే తెగే ఉత్కంఠ మధ్య సాగింది. ఫైనల్‌గా ఆర్సీబీ 2 రన్స్‌ తేడాతో గెలిచింది. ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ. ఆర్సీబీ మ్యాచ్‌ అయితే గెలిచింది కానీ.. సీఎస్‌కే తరఫున ఆడిన ఓ 17 ఏళ్ల కుర్రాడు మాత్రం అందరి హృదయాలు గెలుచుకున్నాడు. అతని పేరు ఆయుష్‌ మ్హత్రే. పేరు ఇది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్సీబీపై అతని కొట్టుడు చూసి.. అందరి మైండ్లలో అతని పేరు రిజిస్టర్‌ అయిపోయి ఉంటుంది. 200లకు పైగా స్కోర్‌ చేశాం.. మ్యాచ్‌ ఈజీగా గెలిచేస్తాం.. ఎవడున్నాడ్రా సీఎస్‌కేలో అంత స్కోర్‌ కొట్టేందుకు అని కొంతమంది ఆర్సీబీ అభిమానులు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ తర్వాత కాస్త రిలాక్స్‌ అయిపోయారు. కానీ, 17 ఏళ్ల ఆయుష్‌ మ్హత్రే అనే కుర్రాడు.. నేనున్నానే నాయనమ్మ అంటూ ఆర్సీబీ బౌలర్లను చీల్చిచెండాడు.

భువనేశ్వర్‌ కుమార్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంత వయసులేదు.. కానీ అదే భువీ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు బాదేశాడు. వరుసగా 4, 4, 4, 6, 4, 4.. పవర్‌ ప్లే స్పెషలిస్ట్‌ అయిన భువీని ఈ రేంజ్‌లో కొట్టిన బ్యాటర్‌ లేడు. అసలు భయమంటే ఏంటో తెలియకుండా.. ఎవరి బౌలింగ్‌లో కొడుతున్నాడో స్పృహ లేకుండా పిచ్చి కొట్టుడు కొట్టాడు. అతని బ్యాటింగ్‌ చూసి.. ఎవడ్రా వీడు ఇలా ఆడుతున్నాడు.. అని ఆర్సీబీ ఫ్యాన్స్‌ అనుకునేలా చేశాడు. ఆర్సీబీ మ్యాచ్‌ గెలిచింది కానీ.. ఆయుష్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు ఆర్సీబీ టీమ్‌కు వాళ్ల ఫ్యాన్స్‌కు గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి. లిట్రల్‌గా భయపెట్టేశాడు భయ్యా. కేవలం 48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 94 పరుగులు చేసి.. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో అవుట్‌ అయ్యాడు. జస్ట్‌ 6 రన్స్‌ తేడాతో సెంచరీ చేసే అద్భుతమైన అవకాశం కోల్పోయాడు. అప్పటి వరకు ఆర్సీబీ బౌలర్లకు కన్నీళ్లు తెప్పించిన ఆయుష్‌.. సెంచరీ మిస్‌ అయిన బాధలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. పాపం.. 17 ఏళ్లే కదా బాధను కంట్రోల్‌ చేసుకోవడం కష్టమే. అదే పసితనానికి నిదర్శనం కూడా.

అయితే.. ఆయుష్‌ సెంచరీ మిస్‌ అయినందుకు ప్రతి క్రికెట్‌ అభిమాని బాధపడ్డాడు. అబ్బా.. సెంచరీ చేసి ఉంటే బాగుండేదే అని అనుకున్నారు. ఇంక్లూడింగ్‌ ఆర్సీబీ ఫ్యాన్స్‌తో సహా. ఆయుష్‌ అవుట్‌ అవ్వడంతో కాస్త ఊపరి పీల్చుకున్నా.. పాపం సెంచరీ కంప్లీట్‌ చేసుకొని ఉంటే బాగుండేదని అనుకున్నారు. ఆ కుర్రాడు ఆడుతుంటే భలే మజా వచ్చిందిలేండి.. అదే వేరే విషయం. ఇక మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. ఆయుష్‌ మాత్రే కేవలం 17 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ లాంటి ఒక బిగ్‌ టోర్నీలో, సీఎస్‌కే వంటి ఒక సక్సెస్‌ఫుల్‌ టీమ్‌లో, ధోని వంటి ఒక లెజెండ్‌తో కలిసి ఆడే ఛాన్స్‌ను ఎలా దక్కించుకున్నాడు? ఇంత చిన్న వయసులో ఎంత కష్టం, కృషి, పట్టుదల ఉంటే ఇది సాధ్యం అవుతుంది చెప్పండి. ఎస్‌.. కష్టమనే మాట కూడా చిన్నబోయేంత కష్టం ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, తండ్రి త్యాగం ఉంది, తాతా ఆశయం ఉంది.. అన్ని కలిపి దేశానికి ఆడాలని నిప్పులా మండే బలమైన ఆకాంక్ష ఉంది.

ఆయుష్‌ మ్హత్రే.. 2007 జూలై 16న మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడే అగ్రి-కోలి కుటుంబంలో జన్మించాడు. అగ్రి కోలి తెగకు చెందిన వారు ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉంటారు. అగ్రి కోలి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణ, చేపల వేట చేస్తుంటారు. నిజానికి అగ్రి, కోలి రెండు వేర్వేరే తెగలు కానీ, దాదాపు ఒక విధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లతో రెండు తెగలు చెందిన వారు కూడా ఒక కుటుంబంగా ఉంటారు. అలాంటి కుటుంబంలోనే ఆయుష్‌ మ్హత్రే జన్మించాడు. మహారాష్ట్రలోని విరార్ నగరంలోని నల్లసోపారా అనే ప్రాంతానికి యోగేష్‌ మ్హత్రే చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి బ్యాంక్‌ ఉద్యోగం సాధించారు. అక్కడి నుంచి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది.

అయితే.. తన కొడుకు ఆయుష్‌ మ్హత్రేలో ఉన్న టాలెంట్‌ను చిన్నతనంలోనే కుటుంబ సభ్యులు ముఖ్యంగా తండ్రి యోగేష్‌ మ్హత్రే, తాతా లక్ష్మీకాంత్‌ నాయక్‌ గుర్తించారు. క్రికెట్‌లో ఆయుష్‌ రాణిస్తాడని బలంగా నమ్మారు. దీంతో.. ఆరేళ్ల వయసులో ఆయుష్‌ క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. విశేషం ఏంటంటే.. అంత చిన్న వయసులో హెల్మెట్‌ పెట్టుకొని క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ.. ఆయుష్‌ మ్హత్రే ఓ నేషనల్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

అతి చిన్న వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టినా.. ఏదో సరదాగా తీసుకోలేదు. చాలా సీరియస్‌గానే ప్రాక్టీస్‌ చేశాడు. ఆయుష్‌ ప్రాక్టీస్‌ కోసంవిరార్ నుంచి చర్చిగేట్(వాంఖడే స్టేడియం పక్కన) వరకు రైలులో దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఆయుష్‌ను ప్రాక్టీస్‌కు తీసుకెళ్లి తీసుకొచ్చే బాధ్యత తాతా లక్ష్మీ కాంత్‌ నాయక్‌ తీసుకున్నారు. మనవడు పెద్దయ్యాక కచ్చితంగా టీమిండియాకు ఆడతాడనే కల తాతా ఆ వయసులో కూడా ఉదయం 4.30 నిద్రలోచి.. మనవడితో ప్రతి రోజు 160 కిలో మీటర్లు ప్రయాణించేలా చేసింది. రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్‌ క్రికెటర్లకు కోచింగ్‌ ఇచ్చిన దినేష్ లాడ్ వద్దే ఆయుష్‌కు కోచింగ్‌ ఇప్పించారు. అయితే రానురాను లక్ష్మీ కాంత్‌ నాయక్‌ అంత దూరం ప్రయాణం చేయలేకపోతుండటంతో.. ఇక చేసేందేం లేక.. తండ్రి యోగేష్‌ మ్హత్రే.. ఒక వైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మరోవైపు కుమారుడి ప్రాక్టీస్‌ ఆగకుండా కష్టపడేవారు.

అలా కొంతకాలం నడిచింది. ఎంతో బరువైన కిట్‌ బ్యాగ్‌ మోసుకుంటూ, అంత దూరం ప్రయాణించి, మళ్లీ ఆయన పని చూసుకుంటూ చాలా కష్టపడేవారు. ఆయన కష్టం చూసి కోచ్‌లు కూడా ఆశ్చర్యపోయేవారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా కొడుకు కోసం ఆయన పడే తపన ఆయుష్‌లో తెలియకుండానే కసిని పెంచింది. అలా అలా.. అంచెలంచెలుగా ఆడుకుంటూ వచ్చాడు. క్రికెటర్‌గా ఆయుష్ మొదటి కల అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఆడటం. అయితే, గత సంవత్సరం ఊహించని దెబ్బ అతని ఆశయాలను దెబ్బతీసింది. గత ఏడాది ఆయుష్ ఇంటర్-క్యాంప్ మ్యాచ్‌లలో రాణించకపోవడంతో NCA టాప్-30 లిస్ట్‌లో చోటు దక్కలేదు. దాంతో ఆయుష్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఒకరకంగా అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కానీ, ఆ తర్వాత కుటుంబ ప్రొత్సాహం, ప్రస్తుత కోచ్‌ ప్రశాంత్‌ శెట్టి మానసిక ధైర్యం ఇవ్వడంతో కోలుకొని వినూ మన్కడ్ ట్రోఫీలో రాణించాడు. డిప్రెషన్‌ నుంచి బయటపడి, తిరిగి ఫామ్‌ను అందుకోవడానికి ఆయుష్ చాలా కష్టపడి పనిచేశాడు, ముంబైలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి రోజుకు రెండు ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొనేవాడు.

KACA అనే​స్థానిక టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియన్ అండర్‌-19, విజయ్ హజారే ట్రోఫీలో ఆడే అవకాశం వచచింది. ఇప్పుడు ఏకంగా IPL కూడా అడుతున్నాడు. 17 ఏళ్ల వయసులో ఇంత బిజీగా, ఇన్ని టోర్నమెంట్లు ఆడటం అంటే సాధారణ విషయం కాదు. అయితే.. ఐపీఎల్‌ కంటే ముందు ఆయుష్‌ ఫిట్‌నెస్‌ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ చివర్లో బాగా అలసిపోయినట్లు కనిపించాడు, సరిగ్గా పరిగెత్తలేక, షాట్‌ను బలంగా కొట్టలేక ఇబ్బంది పడ్డాడు. అతని ఫిట్‌నెస్‌ కోచ్‌ ప్రశాంత్‌ శెట్టి ఫోకస్‌ పెట్టి.. నువ్వు గొప్ప ఏదైనా సాధించాలంటే.. నువ్వు కచ్చితంగా ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టాల్సిందే అని అతని డైట్‌లో మార్పులు చేశారు. 2019 – 20లో ఆయుష్‌కి ఇప్పటి ఆయుష్‌కి చాలా తేడా ఉంది. అందుకు కారణం అతని క్రమశిక్షణతో కూడిన ఫిట్‌నెస్‌ కారణం. ఫిట్‌నెస్‌ సాధించడం కోసం ఆయుష్ బీచ్‌లో గంటల కొద్ది పరిగెత్తేవాడు.

ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత.. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో ఆయుష్ అత్యధిక స్కోరును నమోదు చేశాడు. నాగాలాండ్‌తో ముంబై మ్యాచ్‌లో 117 బంతుల్లో 181 పరుగులు చేశాడు. దీంతో.. ఆయుష్‌కు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు ఫ్రాంచైజీల నుంచి ట్రైయల్స్‌ కోసం ఫోన్‌ వచ్చింది. కానీ, వేలంలో ఆయుష్‌ను ఎవరు తీసుకోలేదు. అయితే.. సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా ఆయుష్‌ మ్హత్రేను సీఎస్‌కే తీసుకుంది. అందుకోసం రూ.30 లక్షలు చెల్లించనుంది. ఏదో ఒక విధంగా ఐపీఎల్‌లో, అందులోనా సీఎస్‌కే లాంటి టీమ్‌లో ఆడే ఆవకాశం వచ్చింది. ఏప్రిల్‌ 20న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో ఆడిన మాత్రే 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి ఇంప్రెస్‌ చేశాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌పై ఓపెనర్‌గా 19 బంతుల్లో 6 ఫోర్లతో 30 రన్స్‌ కొట్టాడు.

పంజాబ్‌తో మ్యాచ్‌లో 7 రన్స్‌ మాత్రమే చేసి విఫలమైనా.. ఆర్సీబీపై ఏకంగా 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి.. ఇండియాలో మరో రోహిత్‌ శర్మ పుట్టాడు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయుష్‌ను రోహిత్‌తో ఎందుకు కంప్యార్‌ చేస్తున్నాను అంటే.. రోహిత్‌ చిన్ననాటి కోచ్‌ దినేష్‌ లాడ్‌ మాట్లాడుతూ.. ఆయుష్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే రోహిత్‌ ఆడుతున్నట్లు అనిపిస్తుంది, రోహిత్‌లానే ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌ చేస్తాడని అని అన్నారు. అలాగే ఆయుష్‌ ఫేవరేట్‌ క్రికెటర్‌ కూడా రోహిత్‌ శర్మనే. సో.. అందుకే ఆయుష్‌ మ్హత్రే అంటే.. జూనియర్‌ రోహిత్‌ శర్మ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌. తన తండ్రి త్యాగానికి మరింత విలువనిస్తూ.. ఆయుష్‌ ఇలాగే సూపర్‌ బ్యాటింగ్‌ చేస్తూ.. త్వరలోనే టీమిండియాకు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. ఆల్‌ ది బెస్ట్‌ టూ ఆయుష్‌ మ్హత్రే. సారీ సారీ.. జూనియర్‌ హిట్‌మ్యాన్‌.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..