MS Dhoni: కెప్టెన్ కూల్ సరికొత్త ఇన్నింగ్స్.. క్రికెట్ నుంచి ఆ రంగం వైపు అడుగులు..!
Drone Startup Garuda Aerospace: ఎంఎస్ ధోనికి రాంచీలో ఒక ఫామ్‌హౌస్ ఉంది. అక్కడ సేంద్రీయ పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు.
డ్రోన్(Drone) స్టార్టప్ గరుడ ఏరోస్పేస్ బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) నియమితులయ్యారు. ఈ విషయాన్ని కంపెనీ జూన్ 6న ప్రకటించింది. ధోనీ కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. దీంతో ధోనీ ఈ సంస్థకు వాటాదారుడిగా మారిపోయాడు. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ ఇటీవల వ్యవసాయానికి మద్దతుగా తన ప్రణాళికలను ప్రకటించింది. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు లేదా పురుగుమందులు, ఎరువుల రిటైలర్లకు డ్రోన్‌లను విక్రయించే నమూనాపై పని చేస్తున్నట్లు కంపెనీ ఏప్రిల్‌లో తెలిపింది.
ఎంఎస్ ధోనికి రాంచీలో ఒక ఫామ్‌హౌస్ ఉంది. అక్కడ సేంద్రీయ పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. గరుడ ఏరోస్పేస్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని క్రికెటర్ చెప్పుకొచ్చాడు. తాను ధోనీకి వీరాభిమానినని గరుడ ఏరోస్పేస్ సీఈవో అగ్నేశ్వర్ జయప్రకాష్ అన్నారు. జైప్రకాష్ మాట్లాడుతూ.. ”గరుడ ఏరోస్పేస్ కుటుంబంలో ధోనీ చేరడంతో మాకల నిజమైంది. కెప్టెన్ కూల్ సపోర్ట్ మా టీమ్‌ని మెరుగ్గా రాణించేలా ప్రోత్సహిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
మొదటి డ్రోన్ యునికార్న్‌గా స్టార్టప్‌గా..
గరుడ ఏరోస్పేస్ 26 నగరాల్లో 300 డ్రోన్‌లు, 500 మంది పైలట్‌లను కలిగి ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ యునికార్న్ స్టార్టప్‌గా అవతరించే మార్గంలో ఉంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ స్విగ్గీ తన కిరాణా సేవ ఇన్‌స్టామార్ట్ కోసం పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసిన నాలుగు డ్రోన్ స్టార్టప్‌లలో గరుడ ఏరోస్పేస్ ఒకటి. పైలట్ ప్రాజెక్ట్ కింద, కిరాణా సామాను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తుంది.
డ్రోన్ల వాడకంతో వ్యవసాయం ఎలా మారుతుంది?
భారతదేశం జనాభా పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా, విస్తీర్ణం పరంగా ఏడవ అతిపెద్ద దేశంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, ఇంత పెద్ద జనాభాకు ఆహార భద్రత కల్పించడం చాలా సవాలుగా మారింది. అందువల్ల సంప్రదాయ వ్యవసాయానికి బదులు ఆధునిక, సాంకేతిక వ్యవసాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. సాగు ఖర్చులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు కూడా వ్యవసాయంలేక నష్టపోతున్నారు.
ఇటువంటి పరిస్థితిలో, డ్రోన్‌ల వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేసే ఖచ్చితమైన వ్యవసాయం దేశంలోని రైతులకు మెరుగైన ఎంపికలను అందిస్తుంది. డ్రోన్లను ఉపయోగించి, రైతులు ఖర్చు తగ్గించడం, సమయం ఆదా చేయడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ, డ్రోన్ల వాడకంతో దీనిని నివారించవచ్చని అంటున్నారు.