క్రికెటర్లు మృతి..! దాడిని తీవ్రంగా ఖండించిన BCCI
పాకిస్తాన్ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మరణించడంపై BCCI తీవ్రంగా స్పందించింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంఘీభావం తెలిపింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో జరగాల్సిన ముక్కోణపు T20I సిరీస్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది. అమాయకుల ప్రాణాలు కోల్పోవడంపై బీసీసీఐ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై చేసిన భయంకరమైన దాడిని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) తీవ్రంగా ఖండించింది. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), క్రికెటర్లకు, మరణించిన ఆటగాళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్టికా ప్రావిన్స్‌లోని అర్గున్, బర్మల్ జిల్లాల్లో పాకిస్తాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్ఘతుల్లా, హరూన్ మరణించిన నేపథ్యంలో శనివారం BCCI నుంచి ప్రకటన వచ్చింది.
అమాయకుల ప్రాణాలను, ముఖ్యంగా క్రీడాకారుల ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరం, చాలా ఆందోళన కలిగించే విషయం. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు BCCI తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం, వారి బాధ, నష్టంలో పాలుపంచుకుంటాంమంటూ బీసీసీఐ పేర్కొంది. ఈ దాడి, ప్రాణనష్టం నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌లో జరగనున్న ముక్కోణపు టీ20I సిరీస్ నుండి వైదొలిగింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు పాల్గొనే ఈ సిరీస్ నవంబర్ 17-29 మధ్య జరగాల్సి ఉంది.
పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన మరో ఐదుగురు ఆటగాళ్లతో పాటు, ప్రావిన్షియల్ రాజధాని షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత జరిగిన దాడిలో ఆ ఆటగాడు మరణించడం తీవ్ర విచారకరం అని ACB ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




