AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan: డబుల్ సెంచరీ చేసినా అసంతృప్తితోనే ఉన్నా.. ఎందుకో చెప్పిన ఇషాన్ కిషన్..

టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్‌ సెంచరీ చేసి సంచలన నాక్ ఆడాడు. 227 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత ఇషాన్ కిషన్ తన డబుల్..

Ishan Kishan: డబుల్ సెంచరీ చేసినా అసంతృప్తితోనే ఉన్నా.. ఎందుకో చెప్పిన ఇషాన్ కిషన్..
Ishan Kishan
Amarnadh Daneti
|

Updated on: Dec 10, 2022 | 8:52 PM

Share

టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్‌ సెంచరీ చేసి సంచలన నాక్ ఆడాడు. 227 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత ఇషాన్ కిషన్ తన డబుల్ సెంచరీపై స్పందించాడు. రెండొందల పరుగుల స్కోర్ చేసినప్పటికి.. త్రిపుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నందుకు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. తాన వికెట్ పడకుండా ఉండి ఉంటే తప్పనిసరిగా త్రిశకం కొట్టేవాడినన్నాడు. 131 బంతుల్లో 210 పరుగులు చేయడం ద్వారా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో అంతర్జాతీయ బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే వన్డేలో డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో నాల్గొవ వాడిగా ఇషాన్‌ కిషన్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో వన్డేలో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ గాయపడటంతో.. అతడి స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. జట్టు స్కోర్ 15 పరుగల వద్ద శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయిన తర్వాత, రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 290 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇషాన్ కిషన్. ఇదే మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన 44వ వన్డే శతకం కూడా సాధించాడు.

ఇషాన్ కిషన్ 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతని మొత్తం స్కోర్‌లో 156 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రాబట్టాడు. చివరికి 36వ ఓవర్ ఐదో బంతికి జట్టు స్కోర్ 305 వద్ద ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తైన తర్వాత ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ.. తాను క్రీజ్‌లో ఉండి ఉంటే తప్పకుండా త్రిపుల్ సెంచరీ సాధించేవాడినని తెలిపాడు. బ్యాటింగ్ చేయడానికి వికెట్ చాలా బాగుందన్నాడు. తాను చాలా క్లియర్‌గా ఉన్నానని, బంతి ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్లి కొట్టే వాడినన్నాడు. తాను ఔట్ అయినప్పుడు ఎంతో ఫీల్ అయ్యానని, ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉన్నాయని, క్రీజ్‌లో ఉండి ఉంటే తప్పనిసరిగా 300 మార్క్‌ దాటేవాడిననే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

విరాట్‌ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి అని ఇషాన్ కిషన్ తెలిపాడు. కోహ్లీకి ఆటపై మంచి అవగాహన ఉందని, తాను 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. సిక్స్ కొట్టి సెంచరీ చేయాలనుకున్నానని, అయితే ఇది తన మొదటి సెంచరీ కావడంతో సింగిల్స్ తీసుకుని శతకం పూర్తి చేసుకోవాలని కోహ్లీ సూచించినట్లు తెలిపాడు. దీంతో తాను ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా కోహ్లీ సూచన మేరకు శతకం పూర్తి చేసుకున్నట్లు చెప్పాడు కిషన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..