Himachal Pradesh: సంప్రదాయం వైపే మొగ్గు చూపిన హిమాచల్ ఓటర్లు.. 37 ఏళ్లుగా ఐదేళ్లకోసారి మారుతూ వస్తున్న అధికారం..
గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి హిమాచల్ ప్రదేశ్‌లో షాక్ తగిలింది. వరుసగా రెండోసారి విజయాన్ని సాధించాలన్న కమలం పార్టీ ఆశలకు బ్రేక్ వేసింది హస్తం పార్టీ. చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మార్క్‌ను చేరుకుని ప్రభుత్వ ఏర్పాటుకు..
గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీకి హిమాచల్ ప్రదేశ్‌లో షాక్ తగిలింది. వరుసగా రెండోసారి విజయాన్ని సాధించాలన్న కమలం పార్టీ ఆశలకు బ్రేక్ వేసింది హస్తం పార్టీ. చివరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మార్క్‌ను చేరుకుని ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. 68 శాసనసభా స్థానాలున్న హిమాచల్‌లో అధికారం కోసం 35 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా.. కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది.హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు సంప్రదాయం వైపే మొగ్గుచూపారు. 1985 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాలేదు. 1993 నుంచి 2017 వరకు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్‌కు చెందిన వీరభద్ర సింగ్, బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ మధ్య తిరుగుతూ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు వీరభద్రసింగ్, 1983 నుంచి 1990, 1993 నుంచి 1998, 2003 నుంచి 2007, 2012 నుంచి 2017 మధ్య దాదాపు 21 సంవత్సరాల పాటు సీఏంగా పనిచేశారు వీరభద్రసింగ్. 1971లో హిమాచల్ ప్రదేశ్ పూర్తి రాష్ట్రంగా అవతరించింది. అప్పటి నుండి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 68 కాగా.. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 53 స్థానాలను గెలుచుకుని అధికారం చేపట్టింది. 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలను మాత్రమే గెల్చుకోగా.. జనతా పార్టీ 53 సీట్లతో గెలిచి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 1982లో 31 నియోజకవర్గాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 29 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు.
1985 ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు వరుసగా రెండోసారి ఎప్పుడూ ఒకే పార్టీని తిరిగి ఎన్నుకోలేదు. 1990లో కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితం కాగా.. బీజేపీ 46 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1993లో జరిగిన హిమాచల్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు సాధించి అధికారం చేజిక్కించుకుంది. 1998 ఎన్నికలలో, హిల్ స్టేట్ హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి పూర్తి మెజార్టీ రాలేదు. రెండు పార్టీలు చెరో 31 శాసనసభ స్థానాలను గెల్చుకున్నాయి. మిత్రపక్షాలు, ఇండిపెండెంట్ల సాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రేమ్‌కుమార్ ధుమాల్‌ను మొదటిసారి హిమాచల్ సీఏంగా నియమించింది బీజేపీ.
2003లో కాంగ్రెస్, 2007లో బీజేపీ, 2012లో కాంగ్రెస్, 2017లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది హిమాచల్ ప్రదేశ్‌లో.. ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు హిమాచల్ ఓటర్లు. 2022 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు ఇక్కడి ప్రజలు. హిమాచల్ ప్రదేశ్‌లో 37 ఏళ్లుగా అక్కడి ఓటర్లు సిట్టింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయలేదు. ఫలితంగా కాంగ్రెస్, బిజెపి మధ్య అధికారం మారుతూ వచ్చింది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌కు చెందిన వీరభద్ర సింగ్, బిజెపికి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా ఈ సంప్రదయాన్ని మార్చడంలో విఫలమయ్యారు. ఈ ఎన్నికలలో కూడా ఓటర్లు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రభుత్వాలు మార్చే ట్రెండ్‌కు చెక్ పెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్‌ను గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేసినా హిమాచల్ ప్రజలు మాత్రం తమ సంప్రదాయన్ని కొనసాగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..