Sammakka Saralamma Jatara 2024: తెలంగాణ మహా కుంభమేళాకు వేళాయె.. వైభవంగా మండమెలిగే ఉత్సవం
Medaram Jathara Mandamelige Festival: ఆదివాసీల మహాకుంభమేళాకు వేళ అయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది.. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వన దేవతల జాతరకు అంకురార్పణ జరిగింది. మేడారం సమ్మక్క - సారక్క జాతరలో అత్యంత కీలక ఘట్టమైన మండమెలిగే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆదివాసీలు.
Medaram Jathara Mandamelige Festival: ఆదివాసీల మహాకుంభమేళాకు వేళ అయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది.. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వన దేవతల జాతరకు అంకురార్పణ జరిగింది. మేడారం సమ్మక్క – సారక్క జాతరలో అత్యంత కీలక ఘట్టమైన మండమెలిగే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆదివాసీలు. సమ్మక్క పూజారులు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి మేడారంలోని సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలు తీసుకొని డోలు వాయిద్యాల నడుమ పూజారులు సమ్మక్క గుడికి చేరుకుని.. పూజా సామగ్రిని శుభ్రం చేశారు. ఆ తర్వాత పసుపు, కుంకుమలతో అమ్మవార్లను అలంకరించారు.
అలాగే, గ్రామ శివారులోని పోచమ్మ, మైసమ్మ ఆలయాల దగ్గర పూజాలు నిర్వహించారు. గ్రామంలోని బొడ్రాయిని పవిత్ర జలంతో శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. గ్రామంలో దుష్ట శక్తులు రాకుండా కోడి పిల్లను, మామిడి తోరణాలు కట్టి రోడ్డుకు ఇరువైపులా బురక కర్రలు పాతి పూజలు చేశారు.
మరోవైపు కన్నెపల్లిలోని సారలమ్మ గుడి దగ్గర కూడా మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయంతో పాటు అమ్మవారి వస్త్రాలు, పూజా సామగ్రిని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసి మామిడి తోరణాలతో అలంకరించారు.
ఇక రాత్రి సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు కలిసి పసుపు, కుంకుమలు తీసుకొని బూర కొమ్ముల శబ్దాలు, డోలు వాయిద్యాల మధ్య సమ్మక్క గద్దె పైకి చేరుకుంటారు. గద్దెలపై పసుపు, కుంకుమల పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి గద్దెల ప్రాంగణంలోనే ఇవాళ రాత్రంతా జాగారం చేస్తారు. గురువారం ఉదయాన్నే సమ్మక్క పూజారులు పూజా సామగ్రితో మళ్లీ గుడికి వెళ్లి పూజలు చేస్తారు.
జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు ఈ మండమెలిగే పూజ చేస్తారు. ఈ పూజ జరిగిందంటే.. అధికారికంగా జాతర ప్రారంభమైనట్టే.. అంటే జాతర మొదలైందన్నమాట.. దీంతో భక్తజనం మేడారానికి పోటెత్తుతోంది.
ఇక ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహా జాతర జరగనుంది. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దలపైకి చేర్చుతారు.. 22న గురువారం.. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి. గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రధాన ఘట్టానికి చేరుతుంది. 23న శుక్రవారం.. వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. 24న దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
ఈ ఏడాది జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..