PM Modi: కనుల పండువగా అబుదాబిలో దేవాలయ ప్రారంభం.. ఏకకాలంలో 1500 ఆలయాల్లో గ్లోబల్ హారతి ఇచ్చిన ప్రధాని

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పశ్చిమాసియాలోనే అతిపెద్ద ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఏడు ఎమిరేట్స్‌ను సూచించే విధంగా ఏడు శిఖరాలతో ఆలయాన్ని నిర్మించారు.

PM Modi: కనుల పండువగా అబుదాబిలో దేవాలయ ప్రారంభం.. ఏకకాలంలో 1500 ఆలయాల్లో గ్లోబల్ హారతి ఇచ్చిన ప్రధాని
Pm Modi In Abu Dhabi Temple
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 14, 2024 | 9:05 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పశ్చిమాసియాలోనే అతిపెద్ద ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఏడు ఎమిరేట్స్‌ను సూచించే విధంగా ఏడు శిఖరాలతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ఒంటెలు, జాతీయ పక్షి డేగ చెక్కడం కూడా గల్ఫ్ దేశానికి అనుగుణంగా రాళ్లపై తీర్చిదిద్దారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో బోచాసన్ నివాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS) నిర్మించిన ఈ హిందూ దేవాలయం సుమారు 27 ఎకరాల స్థలంలో విస్తరించింది. ఈ ఆలయ నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చు చేశారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబూధాబిలో నిర్మించిన స్వామి నారాయణ్‌ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆలయంలో మోదీ తొలిపూజ చేశారు. తొలి హారతి కూడా ఇచ్చారు. వేదాల్లో ప్రవచించిన రీతిలో సామాజిక-ఆధ్యాత్మిక పరంపరకు అనుగుణంగా ఈ ఆలయాన్ని బొచాసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ వైష్ణవ ఆచారాలను పాటించే స్వామినారాయణ సంప్రదాయాన్ని ఆచరిస్తుంది. ఆచరణ సాధ్యమైన ఆధ్యాత్మిక సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం సమాజంలో ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక సవాళ్లకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తుంది. ఆరబ్‌ దేశాల్లో ఇది మొదటి హిందూ మందిరం. ఢిల్లీ, గాంధీనగర్‌, లండన్‌, హూస్టన్‌, షికాగో, అట్లాంటా, టొరంటో, లాస్‌ ఎంజిలస్‌, నైరోబి సహ BAPS సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1550 ఆలయాలు నిర్వహిస్తోంది.

ఆలయానికి సంబంధించిన పూజారి ప్రధాని మోదీకి ఆలయాన్ని చూపిస్తూ.. ఆలయ విశిష్టతను వివరించారు. ఈ ఆలయం భారతదేశం – UAE మధ్య స్నేహానికి ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రధాని మోదీ వీడియో ప్రదర్శనను తిలకించారు.ప్రధాని మోదీ దైవత్వంతో పూర్తి భక్తి పారవశ్యంతో ఆలయాన్ని సందర్శించారు. ఆచారాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించారు. గంగా, యమునా నదీ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రధాని మోదీ ఆలయంలో హారతి నిర్వహించారు. ఇది గ్లోబల్ హారతిగా అభివర్ణించారు. BAPS ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 1,500 దేవాలయాలలో ఏకకాలంలో హారతి నిర్వహించడం విశేషం. ఇదే సమయంలో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే దేవాలయాల్లో కూడా హారతి నిర్వహించారు. ఆలయమంతా కలియతిరిగారు మోదీ. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ ట్రస్ట్‌ సిబ్బందిని అభినందించారు. ఈ ఆలయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందన్నారు మోదీ.

స్వామినారాయణ్‌ వర్గ పదో ఆధ్యాత్మిక గురువు, BAPS అధికార ప్రతినిధి ప్రముఖ స్వామి మహారాజ్‌ ఏప్రిల్‌ 5, 1997న UAEలో మందిరం నిర్మించాలని సంకల్పించారు. దీని ద్వారా దేశాలు, సమాజాలు, సంస్కృతులను ఒక్క తాటిపైకి తేవాలని ఆయన భావించారు. అంతే కాకుండా UAEలో ఉండే భారతీయులకు ఒక ఆలయం అవసరాన్ని కూడా నాడు ఆయన ప్రస్తావించారు. UAEలో భారతీయుల సంఖ్య 33 లక్షలు ఉంటుంది. వీరిలో దాదాపు 200 కుటుంబాలు స్వామి నారాయణ్‌ వర్గానికి చెందినవి ఉన్నాయి.

ఇంజినీరింగ్‌, నిర్మాణపరంగా ఈ ఆలయానికి ఎంతో విశేషాలు ఉన్నాయి. 108 అడుగుల ఎత్తులో నాగరశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఏడు శిఖరాలున్నాయి. UAEలోని ఏడు ఎమిరేట్స్‌కు ఈ ఏడు శిఖరాలు ప్రతీక. ఆలయ ముందు భాగంలో సార్వజనీన విలువలు, వివిధ సంస్కృతుల్లోని సామరస్య గాథలు, హిందూ ఆధ్యాత్మిక నాయకులు, అవతారాల చిత్రాలు ఉన్నాయి.

ఈ ఆలయం చుట్టు ఒక పవిత్ర నదిని ఏర్పాటు చేశారు. దీని కోసం గంగా, యమునా నుంచి జలాలు తీసుకొచ్చారు. సరస్వతి నది తెల్లని కాంతి రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. గంగ ప్రవాహించేందుకు వీలుగా కాశీ తరహా ఘాట్‌ కూడా కట్టారు. శాంతి సామరస్యాలకు ప్రతిరూపంగా నిలిచే ఈ మందిరానికి ముస్లిం రాజు భూమిని విరాళంగా ఇచ్చారు, ప్రధాన ఆర్కిటెక్ట్‌ క్యాథలిక్‌ క్రిస్టియన్‌, ప్రాజెక్టు మేనేజర్‌ సిక్కు, పునాదుల డిజైనర్‌ బౌద్ధుడు, పార్సీ వర్గానికి చెందిన నిర్మాణ సంస్థ, జైన సంప్రదాయనికి చెందిన వ్యక్తి డైరెక్టర్‌గా సర్వమతాలకు ఈ ఆలయం ఆలంబనగా నిలుస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…