Rajasthan: కన్నయ్య ఆలయానికి కళ్ళు చెదిరే కానుకలు.. కేజీ బంగారు బిస్కెట్, రూ. 23 కోట్ల నగదు..
రాజస్థాన్ లోని ప్రసిద్ధి చెందిన ఆలయానికి రికార్డు స్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి. భక్తులు చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, స్వచ్ఛమైన వెండి తాళం, కీ, వేణువులు వంటి ప్రత్యేకమైన వస్తువులను స్వామికి సమర్పించారు.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని సన్వాలియా సేథ్ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ప్రఖ్యాత ఆలయం. ఈ ప్రసిద్ధి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు వెల్లువెత్తాయి. ఇటీవలి ట్రెజరీ గణన సమయంలో భక్తులు సమర్పించిన కానుకల వివరాలను వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 23 కోట్ల నగదు, 1 కిలోల బరువున్న బంగారు బిస్కెట్ తో పాటు చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, వెండి తాళం చెవి, వెండి మురళి వంటి అనేక వస్తువులను కూడా భక్తులు స్వామివారికి కానుకగా సమర్పించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ స్వామివారికి వచ్చిన అతి భారీ కానుకలు ఇవే అని అంటున్నారు. రెండు నెలల విరామం తర్వాత ఆలయ హుండీని లెక్కించారు. ఎక్కువ మొత్తంలో నగదు, బంగారం వెండి వస్తువులు ఉన్నాయి కనుక భక్తులు సమర్పించిన కానుకలను అనేక దశల్లో లెక్కించారు.
తొలిదశలో రూ.11.34 కోట్లు లెక్క తేలింది. రెండోదశలో రూ.3.60 కోట్లు వచ్చాయి. మూడోదశలో మొత్తం రూ.4.27 కోట్లు కానుకగా వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఇప్పటి వరకూ లెక్కించిన నగదు విలువ రూ. 19.22 కోట్లు. ఇంకా నగదు లెక్కింపు దశలు కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలో హుండీ విరాళాల లెక్కింపు దశలు ముగుస్తాయని అధికారులు చెప్పారు. హుండీలు, ఆన్‌లైన్ లో విరాళాలు, గిఫ్ట్ రూమ్‌ల నుంచి సేకరించిన బంగారం, వెండి వస్తువుల తూకం,వాటిని ఖరీదు కట్టడం ఇంకా చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల అమావాస్య (అమావాస్య) నాడు నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ ఈసారి 6-7 దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
చిత్తోర్‌గఢ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్‌గఢ్-ఉదయ్‌పూర్ హైవేపై ఉన్న సన్వాలియా సేఠ్ ఆలయం వైష్ణవ భక్తులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. ఆలయం మూలాలు 1840లో భోలారం గుర్జార్ అనే పాల వ్యాపారితో ముడిపడి ఉంది. పాల వ్యాపారి కలలో భూమిలో ఉన్న కృష్ణుడి విగ్రహాల గురించి చెప్పినట్లు.. ఆలయానికి సంబంధించిన కథ. కలలో కనిపించిన ప్రాంతాల్లో త్రవ్వకాలు జరపగా మండఫియా, భద్సోడా చాపర్‌లలో ప్రతిష్టించబడిన మూడు విగ్రహాలు బయటపడ్డాయి. మండఫియా ఆలయం ఇప్పుడు ఈ మూడు ఆలయాలకు కేంద్రంగా ఉంది. ఈ ఆలయన్ని శ్రీ సన్వాలియా ధామ్ అని పిలుస్తారు. ఈ ఆలయం అత్యంత పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది, వైష్ణవ అనుచరులలో నాథద్వారా తర్వాత రెండవది. స్థానిక విశ్వాసాల ప్రకారం ప్రఖ్యాత హిందూ కవయిత్రి, ఆధ్యాత్మికవేత్త , కృష్ణుడి భక్తురాలు మీరాబాయి ఈ ఆలయంలో కృష్ణుడిని పూజించినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..