AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ, నమ్మకం ప్రధానం.. బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు.. దాంపత్య జీవితం గురించి చాణక్యుడి ఏం చెప్పారంటే..

ఆనందదాయకమైన దాంపత్య జీవితాన్ని అనుభవించేవారు వ్యక్తిగత జీవితంలో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారని ఆయన చెప్పేవాడు. మానవజాతి అభివృద్ధి అంతా విజయవంతమైన వైవాహిక జీవితం మీదే ఆధారపడి ఉంటుందని ఆయన భావించేవాడు.

ప్రేమ, నమ్మకం ప్రధానం.. బంధాన్ని ఏ శక్తీ విడదీయలేదు.. దాంపత్య జీవితం గురించి చాణక్యుడి ఏం చెప్పారంటే..
Chanakya
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Feb 05, 2023 | 8:07 AM

Share

దాంపత్య జీవితం కలకాలం సుఖ సంతోషాలతో హాయిగా కొనసాగటానికి చాణక్యుడు కొన్ని సలహాలు, సూచనలు చేశాడు. సామాజిక స్పృహకు, లోతైన అవగాహనకు, అధ్యయనానికి మారుపేరైన ఆచార్య చాణక్యుడు సమాజంలోని ప్రతి బంధానికి, బాంధవ్యానికి వందలాది సంవత్సరాల క్రితమే కొత్త అర్ధాలు, కొత్త నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటా మానవ జీవితాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధానికి సంబంధించి ఆయన చేసిన సూచనలు, చెప్పిన చిట్కాలు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మానవ సమాజానికి వర్తిస్తాయి. ఆయన ఒక ద్రష్ట. ఒక స్రష్ట . ఆయన ఏ మాట మాట్లాడినా ఎంతో దూరం ఆలోచించి మాట్లాడారనిపిస్తుంది. ఆనందదాయకమైన దాంపత్య జీవితాన్ని అనుభవించేవారు వ్యక్తిగత జీవితంలో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారని ఆయన చెప్పేవాడు. మానవజాతి అభివృద్ధి అంతా విజయవంతమైన వైవాహిక జీవితం మీదే ఆధారపడి ఉంటుందని ఆయన భావించేవాడు.

చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, కుటుంబాన్ని, జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచిన వ్యక్తికి జీవితంలో ఏదీ కష్టం కాదు. ఏదీ అసాధ్యం కాదు. ఏ విజయాన్నైనా అతను లేదా ఆమె అవలీలగా సాధించగలుగుతారు. అయితే, వైవాహిక జీవితం లేదా దాంపత్య జీవితం ప్రశాంతంగా, పరిపూర్ణంగా, ఆనందంగా కొనసాగటానికి భార్యాభర్తలిద్దరి సహకారమూ అవసరం. ఇక ఏ విజయంలో అయినా పాజిటివ్ దృక్పథం అంటే సానుకూల దృక్పథం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, వైవాహిక జీవితంలో ఒత్తిడి, అసంతృప్తి కష్టం, ఇబ్బందులు ఉన్నవారు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ వ్యక్తిగత వృత్తి జీవితాల్లో వైఫల్యాలను, నిరుత్సాహాలను అనుభవించక తప్పదు. అటువంటి వ్యక్తి తన ప్రతిభ పాటవాలను, శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించి, లబ్ధి పొందడం జరగదు. అంటే, జీవితంలో విజయాలు, సాఫల్యాలు సాధించాలన్నా, ఆశించిన విధంగా పురోగతి చెందాలన్నా ముందుగా కుటుంబ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని చక్కదిద్దుకోవటం అవసరం. జీవితంలో పైకి రాదలుచుకున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఈ సూచనలను అనుసరించాల్సి ఉంటుందని ఆయన చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇదొక గొప్ప వరం

చాణక్యుడి ఉద్దేశం ప్రకారం, ఆనందదాయకమైన దాంపత్య జీవితం అనేది ఒక గొప్ప వరం లాంటిది. అదొక గొప్ప అదృష్టం. దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలను ఉపయోగాలను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. వైవాహిక జీవితంలో సంతోషం, సంతృప్తి పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత జీవితంలో కష్టాలు తగ్గుముఖం పడుతుంటాయి. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం, అనుబంధం అనేవి పరస్పర నమ్మకం ఆధారంగా పటిష్టం అవుతుంటాయి. ఆ నమ్మకం లో కూడా హుందాతనం ఉండాలి. ఒకరి భావాలను అభిప్రాయాలను మరొకరు గౌరవించినప్పుడు ఈ అనుబంధం క్రమంగా దృఢం అవుతుంది. ఒకరి కష్టనష్టాలను మరొకరు అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించినప్పుడు వారిద్దరి మధ్య ఉండే బంధం మరింత గట్టిపడుతుంది. వ్యక్తిగతంగా ఎవరి మర్యాద వారికి ఉంటుందని అర్థం చేసుకోవాలి.

వ్యక్తిగత భావనలకు భంగం ఏర్పడినప్పుడు తప్పకుండా ఇద్దరి మధ్యా కోపతాపాలు చిరాకులు తలెత్తడం సహజం. చాణక్య నీతి ప్రకారం, దాంపత్య జీవితం ఆనందంగా ఆరోగ్యకరంగా కొనసాగాలను పక్షంలో భార్యాభర్తల మధ్య స్వచ్ఛమైన ప్రేమకు అవకాశం ఉండాలి. ప్రేమ వల్ల త్యాగనిరతి పెరుగుతుంది. ఒకరి కోసం ఒకరు అన్న భావన ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఇటువంటి భావనల వల్ల అనుబంధం రోజు రోజుకు పెరుగుతుంది. అయితే, ప్రేమ భావాలను ప్రతిసారీ పైకి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అది చేతల్లో ఎంతగా వ్యక్తం అయితే అంత మంచిది. ఇక ప్రేమను ఏ విధంగానూ వంచించడం సమంజసం కాదు.

చాణక్యుడి ఉద్దేశం ప్రకారం, భార్యాభర్తల అనుబంధం చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన బాంధవ్యంలో అసత్యాలకు, వంచనలకు, ఆడంబర ప్రదర్శనలకు తావు లేదు. ఇటువంటి అవలక్షణాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు. వైవాహిక జీవితంలో నిజాయితీ కూడా అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే భార్యాభర్తల అనుబంధం అంతా పటిష్టంగా ఉంటుంది. ప్రేమ నమ్మకం నిజాయితీలు కలిగిన భార్యాభర్తల్ని ప్రపంచంలో ఏ శక్తీ విడదీయలేదు.