YSRCP Letter to Lok Sabha Speaker : ఎంపీ రఘురామ కృష్ణపై అనర్హత వేటు వేయాలి..! లోక్‌సభ స్పీకర్‌కు విజయసాయి రెడ్డి లేఖ
YSRCP letter to Lok Sabha Speaker : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్
YSRCP letter to Lok Sabha Speaker : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రాసిన ఈ లేఖలో రఘురామపై ఆలస్యం తగదని వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని అన్నారు. అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, ఈ పిటిషన్‌పై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు స్పీకర్‌ను కలిశామని గుర్తుచేశారు.
తాము రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌తో పాటు ఆర్టికల్ 102 ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేశామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ తరహా పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని విజయసాయి రెడ్డి లేఖలో వివరించారు. విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంటు సమావేశాలకు హాజరవడం అనైతికమని తీవ్రంగా స్పందించారు. చర్యలు తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇకనైనా వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
11 నెలల క్రితం దాఖలు చేసిన పిటిషన్ లో మార్పులు కోరుతూ ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి జవాబు వచ్చిందని, ఈలోపు రెండు సార్లు పార్లమెంటు సమావేశాలు జరిగాయని గుర్తుచేశారు. ఈ సమాధానం కాస్త ముందుగా వచ్చి ఉంటే బావుండేదని విజయసాయి రెడ్డి లేఖలో పేర్కొన్నారు. స్పీకర్ కార్యాలయం కోరిన మేరకు మార్పులతో తాజాగా మరొక పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నామని తెలిపారు.