Prashant Kishor: మరోసారి శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటి.. ‘మిషన్ 2024’పై కీలక మంతనాలు
Prashant Kishor meets Sharad Pawar: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. పవార్‌తో ఆయన భేటీ కావడం గతపక్షం రోజుల్లో ఇది మూడోసారి. వీరిద్దరి వరుస భేటీలు దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
Prashant Kishor – Mission 2024: హస్తినలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ ఢిల్లీలో మకాం వేశారు. ఆయన ఇంట్లో మంగళవారం జరిగిన కీలక సమావేశంలో తృణాముల్ కాంగ్రెస్, ఆప్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, వామపక్ష పార్టీలు సహా 8 ప్రతిపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. శరద్ పవార్ ఇంట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో మాజీ కేంద్ర మంత్రి యస్వంత్ సిన్హా ప్రత్యేక చొరవ చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం సహా పలు సమస్యలపై ఈ సమావేశంలో వారు చర్చించారు. రాజకీయ అంశాలు చర్చకు రాలేదని ఇందులో పాల్గొన్న నేతలు పైకి చెబుతున్నా…వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ధీటుగా ఎదుర్కోవడం తదితర అంశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు వినికిడి. కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినా…ఆ పార్టీ నేతలు ఎవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదు.
అటు ప్రధాని మోడీకి ధీటుగా ఎదుర్కొనేందుకు రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేసే ప్రయత్నాల్లో తలమునకలైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..ఢిల్లీలో మకాం వేసిన శరద్ పవార్‌తో మరోసారి భేటీ అయ్యారు. పవార్ నివాసంలో వారిద్దరి మధ్య బుధవారం దాదాపు గంటకు పైగా మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. శరద్ పవార్‌తో ఆయన భేటీ కావడం గత పక్షం రోజుల్లో ఇది మూడోసారి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణాముల్ కాంగ్రెస్ తిరిగి అధికార పగ్గాలు సొంతం చేసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ 11న తొలిసారిగా ముంబైలో శరద్ పవార్‌తో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోమవారంనాడు రెండోసారి పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న పవార్‌తో పక్షం రోజుల్లో మూడోసారి ఆయన భేటీ కావడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలతో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగానే శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ సమావేశమైనట్లు తెలుస్తోంది.
భవిష్యత్ రాజకీయ కార్యాచారణపై శరత్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన రాజకీయ శక్తి అవసరమని.. దీని కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలో కాంగ్రెస్ ఉంటుందా? లేదా? అన్న అంశంపై క్లారిటీ రావడంలేదు. కాంగ్రెస్‌ను కూడా దగ్గరకు చేర్చుకుంటే…ఆ పార్టీని వ్యతిరేకించే పలు పార్టీలు థర్డ్ ఫ్రంట్‌కు దూరంగా ఉండే అవకాశముంది. అలాగే కాంగ్రెస్‌ను దూరంపెడితే దాని మిత్రపక్షాలు థర్డ్ ఫ్రంట్‌కు దగ్గరయ్యే అవకాశం లేదు. అలాగే శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు భాగస్వాములుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని దూరంపెట్టి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేసేందుకు ఇది కూడా ఇబ్బందికరంగా మారుతోంది.
మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేకుండా ఏర్పాటయ్యే థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్‌లతో ప్రయోజనం ఉండబోదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలో ఏర్పాటుకానున్న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
Also Read..
సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటలకే తెలంగాణలో ఎంతో మంది చనిపోయారు : దాసోజు శ్రవణ్