- Telugu News Photo Gallery Spiritual photos Sun Transit in Cancer: These zodiac signs to have positive impact in jobs and finance
Jobs Astrology: మిత్రక్షేత్రంలో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వోద్యోగాలు, రాజయోగాలు..!
Sun Transit in Cancer: రాజకీయాలు, పాలన, ప్రభుత్వం, తండ్రి, ఐశ్వర్యానికి కారకుడైన రవి తనకు మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో ఈ నెల 16 నుంచి నెల రోజుల పాటు సంచారం చేయబోతున్నాడు. ఈ నెల రోజుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు రాజయోగాలనివ్వబోతున్నాడు. కొన్ని రాశుల వారికి షేర్లు, స్పెక్యులేషన్లు తదితర అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కలలు సాకారం అవుతాయి. మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి శుభ యోగాలు కలగబోతున్నాయి.
Updated on: Jul 12, 2025 | 6:17 PM

మేషం: ఈ రాశికి రవి చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల రాజకీయ ప్రవేశానికి సమయం అనుకూలంగా ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి గుర్తింపు రావడం గానీ, అధికారం లభించడం గానీ జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారికి పదోన్నతులు కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి పాస్తులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక దన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చుపెట్టడం, మదుపు చేయడం, షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి జరుగుతాయి. అదనపు ఆదాయానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వమూలక లాభం కలుగుతుంది.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఊహించని పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ప్రభుత్వపరంగా, రాజకీయపరంగా అనేక లాభాలు కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి. లాభ స్థానంలో రవి సంచారం వల్ల జాతకంలోని అనేక దోషాలు తొలగిపోతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రవేశానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి యాక్టివిటీ బాగా పెరగడం, అధికార యోగం కలగడం, ప్రాధాన్యం వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పలుకుబడి బాగా పెరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతిగా అత్యంత శుభుడైన రవి భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఏ రంగంలోని వారికైనా రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలోని వారికి మంచి గుర్తింపుతో పాటు హోదా, జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులవుతారు.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. అనేక విధాలుగా సహాయ సహకారాలు కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సామాజికంగా కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. వ్యక్తిగతంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది.



