- Telugu News Photo Gallery Spiritual photos Full Moon October 2025: These zodiac signs to have positive impact details in Telugu
Pournami Horoscope: పౌర్ణమి ప్రభావం.. ఆ రాశుల వారికి కోరికలు నెరవేరడం పక్కా..!
Full Moon October 2025: జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో గానీ, గోచారంలో గానీ చంద్రుడు బలంగా ఉన్న పక్షంలో మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చంద్రుడిని రవి చూసినా (పౌర్ణమి), గురువు చూసినా ఆ గ్రహం బలం విపరీతంగా పెరుగుతుంది. చంద్రుడు బలంగా ఉన్న పక్షంలో మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరడంతో పాటు ఆరోగ్యం పటిష్ఠంగా ఉంటుంది. మాతృ సౌఖ్యం, మాతృభాగ్యం లభిస్తాయి. ఈ నెల (అక్టోబర్) 6, 7, 8 తేదీల్లో మీన రాశిలో ఉన్న చంద్రుడిని రవి చూడడం వల్ల పౌర్ణమి ఏర్పడడంతో పాటు, గజకేసరి యోగం కూడా ఏర్పడుతోంది. ఫలితంగా వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశులవారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.
Updated on: Oct 03, 2025 | 3:57 PM

వృషభం: ఈ రాశివారికి ఈ పౌర్ణమి, గజకేసరి యోగాలు అపారంగా సంపదనిచ్చే అవకాశం ఉంది. ఏదో విధంగా ధనం కూడబెట్టాలన్న ఈ రాశివారి కోరిక, లక్ష్యం చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సానుకూల దృక్పథంతో ప్రయత్నాలు సాగించడం వల్ల ఆశించిన ఫలితాలు అను భవానికి వస్తాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. తల్లి వైపు నుంచి ఇల్లు గానీ, ఆస్తి గానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో పౌర్ణమి, గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు భాగ్య స్థానంలో పూర్తి బలంతో సంచారం చేయడం, గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు పెరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి గానీ, సంపద గానీ లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా అనేక పర్యాయాలు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడి బలం పెరగడం వల్ల అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో చేపట్టే ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు, ధన యోగాలు చాలా కాలం కొనసాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడు బలోపేతం కావడం వల్ల మనసులోని కోరికలు, ఆశలు, లక్ష్యాలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగం పట్టవచ్చు. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

కుంభం: ఈ రాశికి ధన స్థానంలో చంద్రుడి బలం పెరగడం వల్ల ఆదాయ మార్గాలు, అవకాశాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకోవడం జరుగుతుంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.



