No-Confidence Motion: అవిశ్వాస తీర్మానం తిరుగులేని ఆయుధం.. కానీ మన దేశంలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే?

తాజాగా మరోసారి పార్లమెంటు ముందుకు అవిశ్వాస తీర్మానం వచ్చింది. జులై ఆఖరు వారంలోనే కాంగ్రెస్ ఎంపీ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే, నాలుగైదు రోజుల తర్జనభర్జన తర్వాత దీనిపై మూడు రోజుల పాటు చర్చకు పెట్టాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. దాంతోపాటు ఆగస్టు 8, 9, 10 తేదీలలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగబోతోంది. రెండ్రోజుల పాటు చర్చించిన...

No-Confidence Motion: అవిశ్వాస తీర్మానం తిరుగులేని ఆయుధం.. కానీ మన దేశంలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే?
Modi Rahul
Follow us

|

Updated on: Aug 07, 2023 | 10:11 PM

No-Confidence Motion: అవిశ్వాస తీర్మానం… పార్లమెంటు ముందుకు మరోసారి వచ్చిన ఓ బ్రహ్మాస్త్రం. పేరుకే ఇది బ్రహ్మాస్త్రం కానీ దీని కారణంగా పదవీచ్యుతులైన ప్రధానులు లేరనే చెప్పాలి. దేశ చరిత్రలో ఒక్క మొరార్జీ దేశాయ్ మాత్రమే అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగులో మెజారిటీ కోల్పోయి రాజీనామా చేశారు. ఇది 1979లో జరిగింది. తాజాగా మరోసారి పార్లమెంటు ముందుకు అవిశ్వాస తీర్మానం వచ్చింది. జులై ఆఖరు వారంలోనే కాంగ్రెస్ ఎంపీ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే, నాలుగైదు రోజుల తర్జనభర్జన తర్వాత దీనిపై మూడు రోజుల పాటు చర్చకు పెట్టాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. దాంతోపాటు ఆగస్టు 8, 9, 10 తేదీలలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగబోతోందని తేదీలను కూడా వెల్లడించారు. రెండ్రోజుల పాటు చర్చించిన తర్వాత మూడో రోజైన ఆగస్టు పదిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత ఓటింగు జరుగుతుంది.  స్వాతంత్ర భారత దేశంలో మొత్తం 27 అవిశ్వాస తీర్మానాలను పార్లమెంటు చూసింది. ఒక్క మొరార్జీ మాత్రమే దీని ద్వారా ప్రధాని పదవిని కోల్పోయారు. ఇక విశ్వాస పరీక్షకు వెళ్ళి ఇప్పటి వరకు ముగ్గురు ప్రధానులు పదవికి రాజీనామా చేశారు. వీపీ సింగ్ 1990లో, దేవెగౌడ 1997లో, అటల్ బిహారీ వాజ్‌పేయి 1999లో విశ్వాస పరీక్షకు వెళ్ళి ఓడిపోవడంతో రాజీనామా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికున్న బలాన్ని చాటుకునేందుకు అవిశ్వాసం ఓ పరీక్ష అనే చెప్పాలి. బ్రిటన్ పార్లమెంటరీ విధానం నుంచి మన రాజ్యాంగ రూపకర్తలు ఈ అంశాన్ని తీసుకుని పొందుపరిచారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పట్నించి అంటే 1947 నుంచి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి ప్రధానిగా వున్నారు. ఆయన నిర్ణయాలను అప్పట్లో కొద్దిమంది వ్యతిరేకించినా ఆయనపై అవిశ్వాసం ప్రతిపాదించేందుకు జంకారు. దాదాపు 16 ఏళ్ళ తర్వాత 1963లో తొలిసారి నెహ్రూ అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అయితే ఈ అవిశ్వాసం వీగిపోయింది. 1962లో చైనాతో జరిగిన యుద్దంలో ఓడిపోవడంతో ఆనాటి విపక్ష నేత జే.బీ.కృపలానీ 1963 ఆగస్టులో తొలి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. చైనాతో జరిగిన యుద్దంలో ఇండియా ఓడిపోవడానికి నెహ్రూ విధానాలే కారణమని కృపలానీ తన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ తీర్మానంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బలమైన నేతగా కొనసాగుతున్న నెహ్రూకు వ్యతిరేకంగా ఒకరు బలంగా వాదించిన తొలి సందర్భం కావడంతో యావత్ దేశం ఆనాటి అవిశ్వాసంపై చర్చను ఆసక్తికరంగా చూశాయి. ఆనాటి అవిశ్వాస పరీక్షలో జవహర్ లాల్ నెహ్రూ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ప్రభ క్రమంగా సన్నగిల్లడం మొదలైంది. ఆ తర్వాత ఏడాదికే ఆయన అనారోగ్యంతో మరణించారు. అది వేరే విషయం.

అవిశ్వాసం మనదేశంలో భిన్నం

మన దేశంలో అవిశ్వాస తీర్మానాలు వీగిపోవడమే ఎక్కువ. ఎందుకంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశమున్న రాజ్యాంగాలు కలిగిన దేశాలకు భిన్నంగా మన దేశంలో విప్ జారీ చేసే అవకాశం రాజకీయ పార్టీలకు వుంది. జపాన్, ఇటలీ, స్పెయిన్, ఇజ్రాయిల్ వంటి దేశాల రాజ్యాంగాలలోను ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశాన్ని చేర్చారు. అయితే ఆయా దేశాల్లో రాజకీయ పార్టీలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగితే ఎటు ఓటు వేయాలన్న అంశంపై రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం లేదు. దాంతో అక్కడి పార్లమెంటు సభ్యులు తమ ఆత్మ ప్రభోధానుసారం ఓట్లేస్తారు. దాంతో కొన్ని సార్లు పార్లమెంటులో పూర్తి బలమున్న అధికార పార్టీ సైతం ఓడిపోయి గద్దె దిగాల్సి వస్తుంది. కానీ మన దేశంలో రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం వుంది. దాంతో పార్లమెంటులో బలమున్న అధికార పార్టీ ఎట్టి పరిస్థితిలోను ఓడిపోదు. దానికి తోడు 1985 నుంచి మన దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా అమల్లో వుంది. ఒకవేళ పార్టీలు జారీ చేసే విప్‌కు భిన్నంగా ఎంపీలు ఓట్లేస్తే వారి సభ్యత్వం రద్దయ్యే ప్రమాదమూ మన దేశంలో వుంది.  1993లో పీవీ నరసింహారావు మూడోసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు ఆయనకు లోక్‌సభలో కేవలం 225 సభ్యుల మద్దతు మాత్రమే వుంది. కానీ ఆనాడు ఆయన తన చాణక్య నీతితో గట్టెక్కారు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్న సందర్భాలలో అత్యంత వీక్ ప్రభుత్వం పీవీదేనని చెప్పాలి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు అవిశ్వాసాలను ఎదుర్కొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభతో థంపింగ్ నెంబర్ వుండింది. 2018లో తొలిసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న సందర్భంలోను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి సంఖ్యాపరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇపుడు ఎదుర్కొంటున్న అవిశ్వాస పరీక్ష నుంచి మోదీ అవలీలగా గట్టెక్కడం ఖాయం. ఎందుకంటే ఆయన ప్రభుత్వానికి వున్న సంఖ్యాబలం అద్వితీయం.

దేశప్రతిష్ట గురించి ఆలోచించారా?

నిజానికి ప్రస్తుత అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన పాలక బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు కల్పిస్తోంది. ఈ అవిశ్వాస తీర్మానం మణిపూర్ హింసను ప్రస్తావిస్తూ ప్రతిపాదించబడింది. పనిలో పనిగా అధిక ధరలు వంటి అంశాలను కూడా తీర్మాన ప్రతిపాదనలో చేర్చారు. అయితే, అవిశ్వాస తీర్మానం ఏ అంశంపై ప్రతిపాదించినా కూడా… సభలో చర్చ సందర్భంగా సభ్యులు ఏ అంశాన్నైనా ప్రస్తావించవచ్చు. సో.. ఈ చర్చకోసం ఇపుడు రెండ్రోజులను కేటాయించినా.. అది మరింతగా సాగదీతకు దారి తీయ వచ్చు. ఎందుకంటే జులై 20న మొదలైన పార్లమెంటు మాన్‌సూన్ సెషన్‌లో సభ కుదురుగా నడిచిన సందర్భాన్ని చూడలేదు. ప్రతీరోజు పార్లమెంటు ఉభయ సభలు గందరగోళాన్నే చూస్తున్నాయి. ఈ గందరగోళం మధ్యనే ప్రభుత్వం తామనుకున్న పార్లమెంటరీ బిజినెస్‌ని నెట్టుకొస్తోంది. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ పరిపాలనా వ్యవహారాల సవరణ బిల్లు 2023. లోక్‌సభలో ఓ వైపు గందరగోళం కొనసాగుతుండగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం, దానిపై చర్చ జరగడం, ఆమోదించడం జరిగిపోయాయి. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంటులో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిరేపుతోంది. ప్రస్తుతం భారత ఇంటర్నల్ వ్యవహారాన్ని బయటి దేశాలకు చాటే దిశగా విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ యుకే, యూఎస్ దేశాలలో పర్యటించినపుడు ఆయన చేసిన ప్రసంగాలు దేశ ప్రతిష్టను మంటగలిపేవిగా వున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. తాజాగా మణిపూర్ హింసను ప్రస్తావిస్తూ దేశ అంతర్గత అంశాలపై యధేచ్ఛగా మాట్లాడితే అది అంతిమంగా దేశప్రతిష్టను మంటగలపడం ఖాయం. ఇది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చడం ఖాయమని బీజేపీ నేతలు ఆల్‌రెడీ కామెంట్ చేస్తున్నారు. ప్రధాని సమాధానంలోను ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలున్నాయి. అవిశ్వాస పరీక్షలో ఎవరు నెగ్గుతారన్న అంశాన్ని పక్కన పెడితే ఈ చర్చ సందర్భంగా దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది.