Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Drug Test Kit: త్వరలో నార్కో- డ్రగ్ టెస్టుల కోసం సరికొత్త ఆయుధం.. ఈజీగా దొరికిపోతారు..!

దేశంలో గ్రామ గ్రామానికి విస్తరిస్తున్న విష సంస్కృతి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డ్రగ్స్‌ను కట్టడి చేసే క్రమంలో అనుమానితుల వద్ద సేకరించిన శాంపిళ్లను పరీక్షించడమే ఓ పెద్ద పనిగా మారడం కేసుల నమోదు ప్రక్రియను ఆలస్యం చేస్తోంది.

New Drug Test Kit: త్వరలో నార్కో- డ్రగ్ టెస్టుల కోసం సరికొత్త ఆయుధం.. ఈజీగా దొరికిపోతారు..!
Amit Shah In Ncord Meeting
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Jul 19, 2024 | 10:30 AM

దేశంలో గ్రామ గ్రామానికి విస్తరిస్తున్న విష సంస్కృతి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. డ్రగ్స్‌ను కట్టడి చేసే క్రమంలో అనుమానితుల వద్ద సేకరించిన శాంపిళ్లను పరీక్షించడమే ఓ పెద్ద పనిగా మారడం కేసుల నమోదు ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం త్వరలో ఓ నార్కో-డ్రగ్ టెస్ట్ కిట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. గురువారం (జులై 18) ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 7వ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) హైలెవెల్ మీటింగ్‌లో మాదకద్రవ్యాల కట్టడిలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రూపొదించిన 2023 సంవత్సర వార్షిక నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. అలాగే మాదక్ పదార్థ్ నిషేధ్ అసూచన కేంద్ర (MANAS) పేరుతో ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1933 కి ఎవరైనా డయల్ చేసి మాదక ద్రవ్యాల రవాణాకు సంబంధించిన సమాచారంతో పాటు వాటికి బానిసలై బయట పడలేకపోతున్నవారు సహాయం సైతం కోరవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. అంటే ఇది డీ-అడిక్షన్‌పై సూచనలు చేయడంతో పాటు డ్రగ్ ట్రాఫికింగ్ సమాచారాన్ని సేకరించి సంబంధిత దర్యాప్తు సంస్థలకు చేరవేసేందుకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు.

దేశ యువతను పూర్తిగా నిర్వీర్యం చేసే అత్యంత ప్రమాదకారి మాదకద్రవ్యాల విషయంలో తాము అత్యంత కఠిన వైఖరితో వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సమావేశం అనంతరం ప్రసంగిస్తూ.. డ్రగ్స్ విషయంలో తమ ప్రభుత్వం అనుసరించబోయే విధానం గురించి స్పష్టం చేశారు. డ్రగ్స్ పై మొదలుపెట్టిన పోరాటంలో అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని అన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే యుద్ధం చేస్తే సరిపోదని, 130 కోట్ల ప్రజలంతా కలిసి పోరాడితేనే విజయం సాధించగలమని అన్నారు. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే యువరక్తంతో నిండిన పౌర సమాజమే అత్యంత కీలకమని, అలాంటి యువత డ్రగ్స్ కి బానిసై నిర్వీర్యం కాకూడదని అన్నారు.

ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై పోరాటానికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలని, అప్పుడే యుద్ధం గెలవగలమని అమిత్ షా వ్యాఖ్యానించారు. డ్రగ్స్ పై పోరులో భాగంగా వ్యవస్థాగతమైన సంస్కరణలతో పాటు విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నామని చెప్పారు. 2004 నుంచి 2013 మధ్య కాలంలో రూ. 5,933 కోట్ల విలువైన 1.52 లక్షల కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 22 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన 5.43 లక్షల కేజీల డ్రగ్స్ సీజ్ చేసినట్టు తెలిపారు. మోదీ హయాంలో అనేక డ్రగ్స్ రాకెట్స్ మూలాలను వెలికితీసి అంతం చేసినట్టు చెప్పారు.

మాదక ద్రవ్యాలను మన దేశంలోకి విస్తృతంగా పంపిణీ చేసేందుకు శత్రుదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఆధునిక యుద్ధ తంత్రాల్లో భాగమని అన్నారు. తద్వారా దేశంలోని యువతను పూర్తిగా నిర్వీర్యం చేసి దేశాన్ని దెబ్బతీయాలన్న పన్నాగం దాగి ఉందని సూత్రీకరించారు. పై నుంచి కిందకు, కింద నుంచి పై వరకు ఈ విషవృక్షాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా సరిహద్దుల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే, అక్కడితో వదిలేయకుండా దాని మూలాల వరకు దర్యాప్తు చేసి పూర్తి నెట్‌వర్క్‌ను నిర్మూలించాలని దర్యాప్తు సంస్థలకు సూచించారు. మానస్ పోర్టల్, హెల్ప్‌లైన్ నెంబర్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాకు చేరాలని పిలుపునిచ్చారు.

త్వరలో తాము నార్కో-డ్రగ్ టెస్టింగ్ కిట్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వాటి ద్వారా అప్పటికప్పుడే నార్కో-డ్రగ్ టెస్ట్ నిర్వహించి ఫలితాలు విశ్లేషించవచ్చని తెలిపారు. తద్వారా కేసుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శాంపిళ్లను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించి, అక్కణ్ణుంచి ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆ తర్వాతే కేసులు నమోదు చేయడం సాధ్యపడుతుంది. ఈలోగా కొందరు నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. కొత్తగా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వస్తే.. ప్రక్రియలో జాప్యాన్ని పూర్తిగా నివారించవచ్చు.

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 ప్రాంతీయ కార్యాలయాలు, 13 జోనల్ కార్యాలయాలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సంస్థ డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సశస్త్ర సీమా బల్ (SSB), ,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), భారతీయ నౌకాదళం, కోస్ట్ గార్డు వంటి విభాగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలతో కలిసి సమన్వయంతో పనిచేయడం కోసం NCORD ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రతిరోజూ 24 గంటలూ పనిచేసేలా 1933 నెంబర్‌తో ఏర్పాటైన మానస్ హెల్ప్‌లైన్‌ను ప్రజలంతా వినియోగించుకోవాలని, డ్రగ్స్ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…