Puri Jagannath temple: ముగిసిన పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ
పూరీ రత్న భాండాగారంలో సంపద లెక్కింపు ప్రక్రియ ముగిసింది. భారీ విగ్రహాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూమ్‌కి తరలించారు. గదిలో ఎలాంటి సొరంగ మార్గాలు లేవని క్లారిటీ ఇచ్చింది కమిటీ.
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఆ గదిని తెరిచిన కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత ఇవాళ మరోసారి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత గత ఆదివారం మధ్యాహ్నం మూడో రహస్య గదిని తెరిచారు. ముందుగా ఆ గది తలుపులు..అక్కడున్న మూడు తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వయిన్, మరో 8 మంది ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. రహస్య మందిరాన్ని పరిశీలించారు. కర్రపెట్టెలు, పురాతన కాలం నాటి అల్మారాల్లో స్వామి సంపద ఉన్నట్టు గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో రహస్య గదిలోని ఆభరణాల తరలింపు సాధ్యం కాదని.. మళ్లీ మేజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేశారు.
మూడు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ రత్న భాండాగారాన్ని తెరిచారు. గదిలోని ఓ స్టీల్ అలమరా, 3 కర్ర అలమరాలు, 2 కర్రపెట్టెలతో పాటు మరో ఇనుపపెట్టెను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఇదంతా జస్టిస్ విశ్వనాథ్ రాథో కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ ఏడు గంటల పాటు సాగింది. ఆలయం చుట్టూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని మోహరించారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. అయితే గదిలో సొరంగ మార్గాలు ఉన్నట్టు ఆధారాలేవీ దొరకలేదని తేల్చేసింది కమిటీ. ఫైనల్‌గా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా సంపద స్ట్రాంగ్‌రూమ్‌కి తరలించడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..