విషాదం.. ఏనుగు దాడిలో ఇద్దరు మృతి.. పాపం ఉదయాన్నే పనికి వెళ్తుండగా..
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కన్నడలో సోమవారం ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులు రంజిత, రమేష్ రాయ్ నైలాగా గుర్తించారు.

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కన్నడలో సోమవారం ఏనుగుల దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులు రంజిత, రమేష్ రాయ్ నైలాగా గుర్తించారు. రంజిత (20) అనే యువతి.. తాను పనిచేస్తున్న కడప తాలూకాలోని రెంజిలాడి గ్రామంలోని పేరడ్క పాల సొసైటీకి వెళ్తుండగా ఆమె ఇంటి సమీపంలో ఏనుగు దాడి చేసింది. ఆమె అరుపులు విని రక్షించేందుకు వెళ్లిన నైలా (55)పై కూడా ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నైలా అక్కడికక్కడే మృతి చెందగా, రంజిత ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, ఈ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా వన్యప్రాణుల దాడులు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘గత రెండేళ్లలో ఏడు గ్రామాల్లో ఏనుగుల దాడులు జరిగాయి. చాలా మంది ప్రజలు వినతులు సమర్పించారు, కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు” అని స్థానికుడు తెలిపాడు. ఏనుగు దాడి ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ (DC) రవికుమార్, జిల్లా/డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) దినేష్ గ్రామాన్ని సందర్శించారు. ఈ ఘటనకు సమాధానం చెప్పాలంటూ స్థానికులు అధికారులను చుట్టుముట్టి నిలదీశారు.
ఏనుగులన్నింటినీ చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలించాలని. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాలకు ఏనుగు కారిడార్లు అని పేరు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. తమకు సమస్య నుంచి తక్షణ ఉపశమనం కావాలంటూ స్థానికులు అధికారులను కోరారు.




కాగా, మృతులిద్దరికీ ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డీసీ రవికుమార్ తెలిపారు. అలాగే చనిపోయిన మహిళ సోదరికి ఉద్యోగం మంజూరు చేస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




