Train Tickets:ప్రయాణికులకు శుభవార్త.. ఇక టికెట్ బుకింగ్ కు రైల్వే స్టేషన్ కు వెళ్లే పనిలేదు..
పండుగలు వచ్చినప్పుడు రైలు టికెట్ల కోసం పడే కష్టాలు వర్ణనాతీతం. రిజర్వేషన్ కౌంటర్లు, ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఈ ఇబ్బందుల నుండి ఉపశమనం అందించటానికి, రైల్వే ఇండియా పోస్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుందాం. దేశంలోని ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునే సౌలభ్యం ప్రవేశపెట్టింది. ఈ సేవ రైల్వే స్టేషన్లకు వెళ్లలేని వారికి, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ బుకింగ్ విధానం ఎలా సాగుతుంది, ఎవరికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి లాంటి పండుగల సమయంలో రైలు టికెట్లు దొరకటం కష్టమైన పని. రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లు లేని మారుమూల, సెమీ-అర్బన్ ప్రాంతాల ప్రజలకు ఈ సమస్య మరింత ఎక్కువ. ఈ ప్రజల సౌలభ్యం కోసం రైల్వే, ఇండియా పోస్ట్ సహకారం తీసుకుంది. ఈ చొరవ కింద, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులను రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) తో అనుసంధానించారు. ఈ పోస్ట్ ఆఫీసులు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
పోస్ట్ ఆఫీస్ టికెట్ బుకింగ్ విధానం:
ప్రయాణికులు తమకు దగ్గరలోని పీఆర్‌ఎస్ ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లాలి. తమ ప్రయాణ వివరాలు (గమ్యస్థానం, తేదీ, రైలు నంబర్, పేరు, క్లాస్) అక్కడి సిబ్బందికి చెప్పాలి. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది టికెట్ బుక్ చేస్తారు. ప్రయాణికులు నగదు రూపంలో లేక డిజిటల్‌గా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేసిన వెంటనే సిబ్బంది టికెట్ ప్రింట్ చేసి ఇస్తారు. ఈ టికెట్ రైల్వే జారీ చేసిన పూర్తి చెల్లుబాటు అయ్యే రిజర్వేషన్ టికెట్ అవుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం:
వృద్ధులు: సాంకేతిక పరిజ్ఞానం తెలియని వృద్ధులు రైల్వే స్టేషన్, సైబర్ కేఫ్‌లకు వెళ్లకుండా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు: రైల్వే స్టేషన్ సౌకర్యం అందుబాటులో లేని వారికి ప్రయాణ వసతి లభిస్తుంది.
వ్యవస్థపై భారం తగ్గుతుంది: ఈ కొత్త ఏర్పాటు ఆన్‌లైన్ సిస్టమ్ పై భారం తగ్గిస్తుంది. సర్వర్ సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సులభతరం అవుతుంది.
ఈ సదుపాయం పారదర్శకత పెంచుతుంది. ట్రావెల్ ఏజెంట్లపై ఆధారపడటం కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఈ సేవ దేశవ్యాప్తంగా 333 పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంది. ప్రయాణికులు జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్‌లతో సహా అన్ని తరగతులకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.




