వినాయక నిమజ్జనంలో ఘోరం.. యముడిలా దూసుకొచ్చిన ట్యాంకర్.. స్పాట్‌లోనే 8మంది..
అక్కడ వినాయక నిమజ్జనం జరుగుతుంది. అందరూ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. కానీ అప్పుడు వారికి తెలియదు తమలో కొంతమంది ప్రాణాలు మరికొద్దిసేపట్లో పోతాయని. అవును గణేష్ ఊరేగింపుపైకి ఓ ట్రక్కు యుముడిలా దూసుకొచ్చింది. ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ భయానక ఘటన కర్ణాటకలో జరిగింది.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వినాయక శోభాయాత్ర విషాదంగా ముగిసింది. వందలాది మంది భక్తులు గణేష్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా.. వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడికక్కడే మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హసన్-మైసూర్ జాతీయ రహదారి-373పై మోస్లెహోసల్లి గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకవైపు గణేష్ ఊరేగింపు జరుగుతుండగా, మరోవైపు వాహనాలు వెళ్తున్నాయి. సడెన్‌గా వేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపు తప్పి ఊరేగింపులోకి దూసుకెళ్లింది.
హ్యాపీగా డ్యాన్సులు చేస్తున్న ప్రజలకు కాసేపు అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. వారు తేరుకునేలోపే ఘోరం జరిగిపోయింది. అప్పటివరకు డ్యాన్సులతో హోరెత్తిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం అందరినీ కలిచివేసింది. ఈ భయంకరమైన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ దుర్ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గణేష్ నిమజ్జనం రోజున ఈ విషాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ‘‘హసన్‌లో గణేష్ నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపైకి లారీ దూసుకెళ్లడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, 20 మందికి పైగా గాయపడటం చాలా బాధాకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఈ ప్రమాదాన్ని భయంకరమైనదిగా అభివర్ణించారు.ః
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




