AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా..! రిటైర్మెంట్‌పై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..

త్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో సోనియా రెండోరోజు ప్రసంగించారు. ‘‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది.

Sonia Gandhi: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా..! రిటైర్మెంట్‌పై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Sonia Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2023 | 2:47 PM

Share

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ అంటూ ఈ సందర్భంగా సోనియా అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో సోనియా రెండోరోజు ప్రసంగించారు. ‘‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది’’ అంటూ సోనియా గాంధీ తెలిపారు. ‘‘ ఈ యాత్ర నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీకి ఇదే ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అంటూ సోనియా గాంధీ అన్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ – ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని సోనియా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ యాత్ర ప్రజలతో మమేకకై.. గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది. కాంగ్రెస్ ప్రజలతో ఉందని.. వారి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉందని నిరూపించింది.. అని సోనియా అన్నారు. యాత్ర కోసం కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలందరినీ నేను అభినందిస్తున్నాను. యాత్ర విజయంలో కీలకమైన రాహుల్ కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ సోనియా గాంధీ అన్నారు. కేంద్రలోని బీజేపీ పాలన భారతీయుల్లో భయం, ద్వేషం లాంటివాటికి ఆజ్యం పోస్తుందని సోనియా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని.. మహిళలపై, దళితులపై, ఆదివాసీలపై నేరాలు, వివక్షను అంటగట్టుతుందని.. విలువలను, మన రాజ్యాంగం పట్ల ధిక్కారాన్ని చూపుతూ పాలనను కొనసాగిస్తుందని సోనియా గాంధీ మండిపడ్డారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో పార్టీ శ్రేణుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు జరిగిన ప్లీనరీలో, పార్టీ టాప్ కౌన్సిల్ సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించాలని కమిటీ తీర్మానించింది. కాంగ్రెస్ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌నకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ ప్లీనరీలో చర్చించనున్నారు.

76 ఏళ్ల కాంగ్రెస్ మాజీ చీఫ్ ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఉన్నారు. అయితే, మళ్లీ పార్లమెంటుకు పోటీ చేస్తారా లేదా తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాకు సీటును వదులుకుంటారా అనేది.. పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్న విషయంలో సోనియా.. రిటైర్మెంట్‌ విషయాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..