PM Security Breach: ప్రధాని మోడీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్ కాల్.. పంజాబ్‌లో భద్రతా వైఫల్యాలపై ఆరా..
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం ఘటనపై ఆరా తీశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. అసలేం జరిగిందన్న వివరాలు తెలుసుకున్నారు.
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం ఘటనపై ఆరా తీశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధాని మోదీకి ఫోన్ చేసి.. అసలేం జరిగిందన్న వివరాలు తెలుసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రపతిని ప్రధాని మోడీ కలుస్తారని తెలుస్తోంది. పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా లోపాన్ని గురించి వివరించనున్నారు. ఇదిలావుంటే.. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అసలేం జరిగిందో.. ఇందుకు కారణమెవరో తేల్చాలని.. అత్యున్నతస్థాయి విచారణ జరపాలని పిటిషన్ వేశారు న్యాయవాది మణిందర్ సింగ్. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేంద్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్ ప్రభుత్వం. మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం ఛన్నీ. ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మ ఉన్నారు.
ఇప్పటికే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్సయ్యారు. భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులను ఆదేశించారు. బటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక హెలికాఫ్టర్ ద్వారా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించలేదనీ.. దీంతో ప్రధాని రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించారనీ అమిత్ షా చెప్పారు.
అయితే, భద్రత విషయంలో రాష్ట్ర డీజీపీ పచ్చజెండా ఊపాకే.. రోడ్డు మార్గంలో ప్రధాని కాన్వాయ్ ప్రారంభమైందని షా చెప్పారు. అధికారులు అనుమతి ఇచ్చిన తర్వాత నిరసనకారులకు ప్రధాని పర్యటన వివరాలు ఎలా తెలిసాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రధాని రోడ్ మార్గం వివరాలు ఎవరు అందించారన్నది కూడా ఇక్కడ ప్రధానంగా మారుతోంది.
Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన బీజేపీ
Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..