PM Modi: రక్తం, నీరు ఒకే దగ్గర ప్రవహించవు.. అణుబాంబులకు భయపడం.. పాక్‌కు మోదీ వార్నింగ్..
సమృద్ధి భారత్ కోసం అంతా కలిసి ఉద్యమించాలని ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ మంత్రంతో సమృద్ధి భారత్ అంతా కలిసి అడుగులు వేద్దాం అన్నారు. దిగుమతులు తగ్గితేనే స్వయం సమృద్ధి సాధ్యమన్నారు. అదేవిధంగా సింధూ నదీ జలాల విషయంలో పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు.

ప్రపంచంలో భారత్ ఇప్పుడు శక్తివంతంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 140కోట్ల మంది భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. ఎంతో మంది త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ హీరోలకు మోదీ సెల్యూట్ చేశారు. పహల్గాంలో భార్య కళ్లముందే భర్తలను చంపారన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్న ప్రధాని.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. యుద్ధతంత్రాలు, వ్యూహాలు వాళ్లే సిద్ధం చేసుకున్నారని తెలిపారు. 22 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశామని అన్నారు. ‘‘ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పెంచి పోషించేవాళ్లు ఇదే నా వార్నింగ్. ఎవరినీ వదిలిపెట్టేదిలేదు.. ఉపేక్షించేదిలేదు. పహల్గామ్‌లో క్రూరహత్యలను యావత్ ప్రపంచం చూసింది. ఐకమత్యం శక్తి ఎలా ఉంటుందో ఈ దేశం చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సింధూర్’తో మన సామర్థ్యం ఏమిటో ప్రపంచమంతటికీ తెలిసింది’’ అని మోదీ అన్నారు.
అణుబాంబులకు భయపడం
అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని మోదీ అన్నారు. అది గతంలో నడించిందని.. ఇప్పుడు అటువంటి బ్లాక్‌మెయిల్స్‌కు భారత్ భయపడే ప్రసక్తే లేదని పరోక్షంగా పాక్ ఆర్మీ చీఫ్‌కు మోదీ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం మానవాళి మనుగడే ముప్పు అని వ్యాఖ్యానించారు. సింధూ నీళ్లు కేవలం మన దేశ రైతులకు మాత్రమేనని తేల్చి చెప్పారు. ఎప్పటికీ నీరు, రక్తం కలిసి ప్రవహించవని అన్నారు. ‘‘ సింధూ నది విషయంలో మరో మాట లేదు. వాటిని పాక్ కు ఇచ్చే ప్రసక్తే లేదు. దేశంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఆ నీటిని తరలిస్తాం. సింధూ నదిపై సంపూర్ణ అధికారం భారత్‌దే. దీనిపై ఎప్పటికీ చర్చలు జరిపేది లేదు’’ అని మోదీ స్పషం చేశారు.
మిషన్ సుదర్శన్ చక్ర
శత్రు దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. శ్రీ కృష్ణుని సుదర్శన చక్రం స్ఫూర్తితో ఈ మిషన్‌కు ఆ పేరు పెట్టారు. ఇది భారతదేశం తన సాంస్కృతిక వారసత్వం నుండి రక్షణ ఆవిష్కరణలకు ఎలా ప్రేరణ పొందుతుందో తెలియజేస్తుంది. ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం శత్రు రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, మన దాడి సామర్థ్యాలను మెరుగుపరచడం. దీనివల్ల ఏ విధమైన ముప్పు వచ్చినా వేగంగా, కచ్చితంగా, శక్తివంతంగా ప్రతిస్పందించడానికి వీలవుతుంది. మిషన్ సుదర్శన్ చక్రతో భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై మరింత దృష్టి సారిస్తోందని, భవిష్యత్తులో దేశ భద్రత విషయంలో రాజీపడదని మోదీ స్పష్టం చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి సెమీ కండక్టర్ చిప్స్..
దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. మేడిన్ ఇండియా దేశ శక్తిని ప్రపంచానికి చాటుతుందన్నారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్ పురోగతి సాధించిందన్నారు. 2025 చివరి నాటికి ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్స్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నాలుగు సెమీకండక్టర్ యూనిట్లు ప్రారంభించినట్లు గుర్తు చేసిన మోదీ.. మరో ఆరు సెమీకండక్టర్ యూనిట్లు రెడీ అవుతున్నట్లు తెలిపారు. . మేడిన్ ఇండియా సాయంతోనే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి అతిపెద్ద కారణం మన సాంకేతికత, రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా శక్తి అని అన్నారు. ఉగ్రవాదులను రక్షించడానికి వచ్చిన పాకిస్తాన్‌ను కొన్ని గంటల్లోనే మోకరిల్లేలా చేశామన్నారు.
సొంతంగా అంతరిక్ష కేంద్రం
భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిష్టాత్మక ప్రణాళికను మోదీ ప్రకటించారు. దేశంలో 300కు పైగా స్టార్టప్‌లు.. ఉపగ్రహాలు, అన్వేషణ, అత్యాధునిక సాంకేతికతలలో చురుకుగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చిస్తున్నప్పటికీ, భారత్ 2030 నాటికి సాధించాలనుకున్న 50శాతం క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని 2025 నాటికి చేరుకుందని మోదీ ప్రకటించారు. సౌర, అణు, జల, హైడ్రోజన్ శక్తులలో సాధించిన పురోగతిని ఆయన వివరించారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో అణుశక్తిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10 కొత్త అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయని, 2047 నాటికి అణుశక్తి సామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ అన్నారు.
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్
దేశ ఇంధన, పరిశ్రమ, రక్షణ రంగాలకు అవసరమైన కీలక ఖనిజాలను గుర్తించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే, ‘నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్’ ద్వారా సముద్రంలో చమురు నిక్షేపాలను వెలికితీయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. రైతుల సంక్షేమం, జాతీయ ఆహార భద్రత కోసం ఎరువులను దేశీయంగానే ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, రైతుల ఆర్థిక సార్వభౌమత్వం పెరుగుతుందని అన్నారు.
ప్రపంచ ఔషధ కేంద్రంగా..
భారత్ ప్రపంచ ఔషధంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. కోవిడ్-19 సమయంలో అభివృద్ధి చేసిన కోవిన్ వంటి స్వదేశీ వ్యాక్సిన్లను స్ఫూర్తిగా తీసుకొని కొత్త మందులు, వ్యాక్సిన్లకు పేటెంట్లు పొందాలని పరిశోధకులకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అలాగే, దేశంలోనే సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని యువతను కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




