‘నన్ను తీసుకెళ్లిపో.! వీళ్లు రాక్షసులు..’ కాపాడాలంటూ బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్.. కాసేపటికే
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 18 ఏళ్ల యువతి జీవితం ఒక విషాదగాథగా మారింది. డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకునే క్రమంలో ‘నీట్’ పరీక్షలో సత్తా చాటిన ఆమె, ప్రేమ విషయంలో ఓడిపోయింది. పరువు హత్యకు బలైంది. ఆమె తన ప్రియుడికి పంపిన చివరి సందేశం ఇప్పుడు సమాజాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన గుజరాత్‌లోని బనస్కాంతలో చోటుచేసుకుంది.

గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన చంద్రిక(18) వైద్య విద్యలో ప్రవేశం కోసం పాలన్‌పూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంది. ఆ సమయంలో స్థానిక యువకుడు హరేశ్ చౌధురితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమలో పడ్డంత మాత్రాన తన చదువును నిర్లక్ష్యం చేయలేదు. నీట్(NEET)లో అర్హత కూడా సాధించింది. కానీ తన ప్రేమను కాపాడుకోవడం కోసం ఆమె చివరి క్షణం వరకు చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. హరేశ్ చౌధురితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న ఆమె.. తన ప్రేమ సంబంధం కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతోనే రోజులు గడిపింది. ఆ భయం నిజమైంది. చివరి క్షణాల్లో చంద్రిక తన ప్రియుడికి ఓ హృదయవిదారక సందేశం పంపింది. ‘దయచేసి రండి.. నన్ను తీసుకెళ్లండి. నా కుటుంబం నాకు బలవంతంగా పెళ్లి చేయడానికి సిద్ధమవుతోంది. నేను నిరాకరిస్తే, వాళ్లు నన్ను చంపేస్తారు. నన్ను రక్షించండి!’ అంటూ ఆమె పంపిన వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ మెసేజ్ హరేశ్ చౌధరి వద్దకు చేరిన కొద్దిసేపటికే ఆమె జీవితం దారుణంగా ముగిసింది.
పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ యువతిని ఆమె తండ్రి సెంధాభాయ్ పటేల్, బాబాయి శివరాంభాయ్ పటేల్ కలిసి హత్య చేశారు. శివరాంభాయ్ ఇంట్లో ఆమెకు నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చి, గొంతు కోసి చంపారు. నేరం బయటపడకుండా, వారు ఆమె అంత్యక్రియలను కూడా వేగంగా నిర్వహించారు. ఈ ఘటన జూన్ 24 రాత్రి జరగగా, మరుసటి రోజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చంద్రిక ప్రియుడు, ఆ సమయంలో జైలులో ఉండటం వల్ల ఆమె పంపిన మెసేజ్‌కు సకాలంలో స్పందించలేకపోయాడు. అయినప్పటికీ, ఆమె కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ, విచారణ జరిగే సమయానికే ఆమె ఈ లోకంలో లేదు. ఆమె ప్రేమను తిరస్కరించిన కుటుంబం నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఆమె ప్రేమ విషయం బయటపడితే పరువు పోతుంది అని మాత్రమే ఆలోచించింది. ఎక్కడ చంద్రిక మళ్లీ తన ప్రియుడితో జీవితం పంచుకుంటుందోనన్న భయంతో తండ్రి, బాబాయి కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం శివరాంభాయ్ అరెస్ట్ అయ్యాడు. కానీ సెంధాభాయ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన సమాజంలో వేళ్లూనుకున్న కులతత్వానికి మరొక ఉదాహరణగా నిలిచింది. మనిషి జీవితం, ప్రాణం కంటే కూడా కులం, పరువుకే ప్రాధాన్యతనిచ్చే సామాజిక దురాచారం.. చంద్రిక ప్రేమనే కాదు, ఆమె జీవితాశయాలను కూడా హత్య చేసింది. వైద్యురాలిగా ఎంతో మంది ప్రాణాలు నిలపాలన్న ఆమె కల, తన ప్రాణాన్నే నిలబెట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఆమె కలలు, ఆశలు, ప్రేమ.. అన్నీ ఒక్క రాత్రిలో ఆగిపోయాయి.
ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




