Independence Day Celebrations 2025 Live: సామాన్యులకు డబుల్ దీపావళి.. మోదీ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్..
Independence Day Parade 2025 Live Updates : యావత్ భారతం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని హోదాలో మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశరాజధానిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. 15 వేల మంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు.
LIVE NEWS & UPDATES
-
చుక్క నీరు వదులుకోం
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా చుక్క నీటిని కూడా వదులుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ రాష్ట్ర అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీటి పంపిణీపై చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది, భయపడేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ నీటిహక్కులపై ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తామని స్పష్టం చేశారు.
-
బనకచర్లతో ఎవరికీ నష్టం ఉండదు
బనకచర్లతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎగువ నుంచి వచ్చే వరదతో ఇబ్బందులు భరిస్తున్న తాము.. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. బనకచర్లను నిర్మించి రాయలసీమకు గోదావరి జలాలు అందిస్తామన్నారు.
-
-
వేలాది మంది బలిదానం వల్లే..
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల గౌరవ వందనాన్ని స్వీకరించి.. వారందరికీ మిఠాయిలు పంచారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేలమంది బలిదానంతో మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నట్లు తెలిపారు.
-
రాజీ పడేది లేదు – భట్టి
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతులకు 20 వేల 216 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. గత పాలకుల పాపాలు శాపాల్లాగా వెంటాడుతున్నాయని ఆరోపించారు. రైతులు సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని భట్టి స్పష్టం చేశారు.
-
దేశంలో విదేశీ కుట్రలు – పవన్
విదేశీ శక్తుల కనుసన్నల్లో..అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో పవన్ జాతీయ జెండా ఎగురవేశారు పిఠాపురంలో 9 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మించే ఇండస్ట్రియల్ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దేశంలో కుట్రకు విదేశీ శక్తులు యత్నిస్తున్నాయని అన్నారు.
-
-
జెండా ఆవిష్కరించిన స్పీకర్, హైకోర్టు సీజే..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన మండలిలో చైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాలను ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాలను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
-
P-4 మోడల్‌తో పేదరిక నిర్మూలన – చంద్రబాబు
విజయవాడలో జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు…ప్రజలనుద్దేశించి మాట్లాడారు. P-4 మోడల్‌తో పేదరిక నిర్మూలనలో కొత్త అడుగు వేస్తామన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్‌తో నాణ్యమైన చదువు కల్పిస్తామన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సీఎం తెలిపారు.
-
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం సీఎం ప్రసంగిస్తున్నారు. ఆ లైవ్ ఇక్కడ చూడండి..
-
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దీనికి సంబంధించిన లైవ్ ఇక్కడ చూడండి..
-
ఈ సారి సామాన్యులకు డబుల్ దీపావళి
దేశ ప్రజలకు దీపావళి కానుక ఇస్తామని మోదీ తెలిపారు. ఈసారి డబుల్ దీపావళి అందిస్తామన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామన్నారు. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా..రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సంస్కరణల విషయంలో ప్రజలు తమకు మద్దతు పలకాలని మోదీ కోరారు.
-
యువత కోసం రూ.లక్ష కోట్లతో పథకం
దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో మోదీ కొత్త పథకం ప్రారంభించారు. దీనికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన అని పేరు పెట్టినట్లు చెప్పారు. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త సంస్కరణలు దీపావళి లోపు వస్తాయన్నారు. వీటిని సామాన్యులకు దీపావళి కానుకగా ఇస్తామని తెలిపారు.
-
అర్ధరాత్రి మహిళల ఫ్రీడమ్ వాక్
ఆడవాళ్లు అర్థరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అన్న గాంధీ మాటలను నిజం చేస్తూ రాజమండ్రిలో మహిళలు అర్థరాత్రి ఫ్రీడమ్ వాక్ నిర్వహించారు. ఆజాదీ కా మహిళా సఫర్ – ఉమెన్స్ మిడ్‌నైట్ ఫ్రీడమ్ వాక్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి పుష్కరఘాట్ నుంచి కోట గుమ్మం వరకు జరిగిన ఫ్రీడమ్ వాక్‌లో మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
ఎల్‌వోసీ తంగ్ధర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
దేశ వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎల్‌వోసీ తంగ్ధర్‌లో ఇండియన్ ఆర్మీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. త్రివర్ణ పతాకానికి ఆర్మీ జవాన్లు సెల్యూట్ చేశారు.
-
ఆపరేషన్ సింధూర్ హీరోలకు నా సెల్యూట్ – మోదీ
ఎంతో మంది త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ హీరోలకు మోదీ సెల్యూట్ చేశారు. పహల్గాంలో భార్య కళ్లముందే భర్తలను చంపారన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్న ప్రధాని.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. యుద్ధతంత్రాలు, వ్యూహాలు వాళ్లే సిద్ధం చేసుకున్నారని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు.
-
ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన మోదీ
ఢిల్లీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు త్రివిధ దళాల వందనం స్వీకరించారు. ఎర్రకోట నుంచి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
-
ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని మోదీ… లైవ్ వీడియో..
ఢిల్లీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. ప్రధాని మోదీ లైవ్‌ను ఇక్కడ చూడండి..
-
రాజ్‌ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి మోదీ నివాళులు
ఢిల్లీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. కాసేపట్లో ఆయన ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ప్రధాని హోదాలో 12వ సారి మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
-
12వ సారి జెండా ఆవిష్కరించనున్న మోదీ
79వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్రం దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ 12వ సారి జెండా ఎగురవేయనున్నారు. ఈ వేడుకల్లో 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15 వేల మంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Published On - Aug 15,2025 6:56 AM
