Divorce Cases In India: మనదేశంలో ఈ రాష్ట్రాల్లో పెరుగుతున్న విడాకుల కేసులు.. 8 రీజన్స్‌తో డైవర్స్‌కు శ్రీకారం చుడుతోంది స్త్రీలే..
అత్యధిక హిందువులు నివసించే భారతదేశంలో సంప్రదాయాలు, ఆచారాలు విభిన్నమైనవి. హిందువుల వివాహానికి సంబంధించిన చట్టాలకంటే.. సంప్రదాయం పరంగా విభిన్నంగా ఉంటాయి. పెళ్ళంటే నూరేళ్ళ పంట అని నమ్మకం. పెళ్లి ఇరువురు వ్యక్తులను కలిపే బంధమే కాదు.. రెండు కుటుంబాలను కలిపిసే వేడుక. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా వివాహం బంధం గురించి కూడా మార్పులు వచ్చాయి. మన దేశంలో కూడా రోజు రోజుకీ విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో విడాకులు తీసుకున్న రాష్ట్ర గణాంకాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
బెంగళూరుకు చెందిన ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తన జీవితాన్ని బలవంతంగా ముగించే ముందు సుభాష్ తన భార్య తనపై 9 నకిలీ కేసులు పెట్టిందని.. ఈ కేసుల వలన తాను విసిగిపోయానని సూసైడ్ నోట్స్ లో పేర్కొన్నాడు. వీటిలో ఒక విడాకుల కేసు కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో విడాకుల గురించి ప్రజల మనస్సులలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెళ్లిని పవిత్ర బంధంగా భావించే మన దేశంలో అసలు దంపతులు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? నేటి కాలంలో ఎక్కువ సంవత్సరాలు దంపతులు కలిసి జీవించడం లేదు.? ఏ రాష్ట్రం నుంచి విడాకుల కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయో ఈ రోజు తెలుసుకుందాం.. అంతేకాదు విడాకులకు గల కారణాల గురించి కూడా తెలుసుకుందాం..
భారతదేశంలో అత్యధిక విడాకుల కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇక్కడ విడాకుల రేటు 18.7 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. విడాకుల రేటు పరంగా మహారాష్ట్ర తర్వాత కర్ణాటక రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ విడాకుల రేటు 11.7 శాతం. విడాకుల రేటు 8.2 శాతంగా ఉన్న పశ్చిమ బెంగాల్ విడాకుల విషయంలో మూడో స్థానంలో ఉంది.
విడాకుల విషయంలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే
- ఢిల్లీలో విడాకుల రేటు 7.7 శాతం.
- తమిళనాడులో విడాకుల రేటు 7.1 శాతం.
- తెలంగాణలో విడాకుల రేటు 6.7 శాతం.
- కేరళలో విడాకుల రేటు 6.3 శాతం.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో విడాకుల రేటు 30 శాతానికి పైగా ఉంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారతదేశంలో విడాకుల రేటు 2005లో 0.6 శాతం ఉండగా, అది 2019లో 1.1 శాతానికి పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఈ నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడు రెట్లు పెరిగాయి.
పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత ఎందుకు విడాకులు తీసుకుంటున్నారంటే..
ఐక్యరాజ్యసమితి నివేదికలో విడాకుల కారణాలను కూడా ప్రస్తావించింది. భారతదేశంలో విడాకులను కోరడానికి అతిపెద్ద కారణం గృహ హింస, మోసం అని పేర్కొంది. అంతేకాదు 50 సంవత్సరాల వయస్సులో విడాకులు తీసుకుంటున్న దంపతులు స్వేచ్ఛను కోరుకుంటున్నారు.. అంతేకాదు పరిష్కరించని సమస్యల కారణంగా డైవర్స్ ను కోరుకుంటున్నారు. అదే విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఏళ్లపాటు అవమానాలు ఎదుర్కొంటున్నారు.. ఇది కూడా విడాకులకు కారణం కావచ్చు. అటువంటి అనేక సందర్భాల్లో భావోద్వేగం ఎదుర్కొనే సమయంలో తమ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించక పొతే విడాకులను కోరుకుంటున్నారు.
ప్రస్తుతం విడాకులకు శ్రీకారం చుడుతోంది స్త్రీలే అని నివేదికల ద్వారా తెలుస్తోంది. నిర్ణీత వయస్సు దాటిన తర్వాత మహిళలు..తమ తోటి ఆడపిల్లలను లేదా స్త్రీలను చూసినప్పుడు తాము పెళ్లి చేసుకుని ఎక్కువ బాధలు పడ్డామని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, ఇంటి పనులతోపాటు పిల్లలను పెంచే బాధ్యతను ఒంటరిగా భుజానికెత్తుకున్నామని ఆలోచిస్తున్నారు. అంతేకాదు తాము బార్యగా, తల్లిగా ఇల్లాలిగా ఎంత కష్టపడినా తమ భర్త నుంచి ఎప్పుడూ ప్రసంసలు లబించాలేదని.. భర్త సహకారం దొరకడం లేదని భావిస్తున్నారు. ఈ కారణంగానే చాలా సందర్భాలలో విడాకులకు శ్రీకారం చుట్టేది స్త్రీలే.
విడాకులకు ఇవే ప్రధాన కారణాలు
- గృహ హింస , మోసం
- పదవీ విరమణ తర్వాత జీవిత అర్థాన్ని మార్చడం
- ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
- కొత్తగాజీవితాన్ని ప్రారంభించాలనే కోరిక
- చాలా సంవత్సరాల అవమానానికి ప్రతీకారం
- ఎన్ని పనులు చేసినా ఎప్పుడూ గౌరవం పొందక పోవడం
- జీవిత భాగస్వామి నుంచి మానసిక, శారీరక మద్దతు లేకపోవడం
- ప్రేమలో రెండవ అవకాశం
50, 40 ఏళ్ల తర్వాతే మహిళలు ఎందుకు విడాకులు కోరుకుంటున్నారంటే
ఇప్పుడు విడాకుల విషయంలో మహిళలు 50, 40 ఏళ్ల తర్వాతే ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారనేది మిలియన్ డాలర్ ప్రశ్న.. దీనికి సమాధానం వారి పిల్లలు. అంటే పెళ్లయిన వెంటనే పిల్లలు పుడితే పిల్లల గురించి శ్రద్ధ పెరుగుతుంది. తన కష్టాలన్నీ మరిచిపోయి పిల్లల్ని పెంచడంలో నిమగ్నమైపోయింది. ఇది సుమారు 20-25 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న మహిళల విషయంలో జరిగింది. అంటే మానసికంగా విడాకులు ఇప్పటికే జరిగాయి..అయితే ఆచరణ రూపంలో చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది విడాకులకు దరఖాస్తు
ఈ రోజు మహిళలు విడాకులను తీసుకోవడంలో వెనుకాడడం లేదు. భార్యాభర్తల సంబంధంలో తమకు ఏమీ దక్కలేదని స్త్రీలు భావించిన వెంటనే.. డైవర్స్ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంతకుముందు మహిళల్లో ఆర్థిక భద్రత, పిల్లల పెంపకం గురించి ఆందోళన ఉండేది. అయితే నేటి స్త్రీలల్లో ఈ విషయాలపై ఆందోళన లేదు. అటువంటి పరిస్థితిలో స్త్రీలు భర్త నుంచి విడిపోవాలనే విషయంలో పెద్దగా ఆలోచించడం లేదు. విడాకుల కోసం దాఖలు చేసే మహిళల సంఖ్య పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.
ఎక్కువ విడాకులు ఏ వయస్సులో జరుగుతున్నాయి?
2021 నుంచి 2022 మధ్య నిర్వహించిన ఒక అధ్యయనంలో 25 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారు గరిష్ట సంఖ్యలో విడాకులు తీసుకున్నారని వెల్లడైంది. దీని తరువాత 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు విడాకుల కోసం గరిష్ట సంఖ్యలో దరఖాస్తులను దాఖలు చేశారు. ఆ తర్వాత 35 నుంచి 44 సంవత్సరాల మధ్య .. 45 నుంచి 54 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు కూడా డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు ఉన్నారు. 55 నుంచి 64 సంవత్సరాల వయసు.. అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు కూడా జాబితాలో చేర్చబడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..