Yoga benefits: పిల్లలలో ఏకాగ్రత పెరగాలంటే.. ఈ ఐదు యోగాసనాలను రోజూ చేయించండి..
ప్రస్తుతం పోటీ యుగం నడుస్తోంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా మొదటి స్థానం కోసం పోటీపడుతున్నారు. అయితే పిల్లలు పోటీ ప్రపంచంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా పరీక్షలు మొదలైతే చాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి కొన్ని యోగా ఆసనాలను నేర్పించి.. వాటిని రోజు చేసేలా చేయండి. బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి ఈ యోగాసనాలు.
Updated on: Dec 11, 2024 | 5:30 PM

చిన్న తనం నుంచే అన్నింటా తమ పిల్లలు మొదటి స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకనే పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు చదివే సమయుంలో ఏకాగ్రత చూపించడం లేదని.. అందుకనే చదివింది గుర్తుంచుకోవడం లేదని తల్లిదండ్రులు తరచుగా ఫిర్యాదు చేయడం కనిపిస్తుంది. అయితే పిల్లలలో ఏకాగ్రత లేకపోవడానికి ముఖ్యమైన కారణాలు చెడు ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు టీవీ లేదా సెల్ ఫోన్ చూడడం, సరైన నిద్ర లేకపోవటం లేదా రాత్రి లేటుగా నిద్రపోవడం వంటివి. అయితే పిల్లలు చదువుపై దృష్టి పెట్టాలంటే ప్రతిరోజూ కొన్ని యోగా ఆసనాలను చేయాలి. దీని వల్ల పిల్లల మనసులోని ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉనారు. పిల్లలు తాము చేస్తున్న పనిపై పూర్తిగా దృష్టి పెడతారు.

పిల్లల ఏకాగ్రతను పెంచడానికి.. తినే ఆహరంలో మార్పు చేయడమే కాదు కొంత సమయం యోగా చేయడం చాలా ముఖ్యం. ఈ అలవాటు నిద్ర పోయే విధానాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. కనుక పిల్లలు చదువులో లేదా ఏదైనా కార్యకలాపంలో ఏకాగ్రతను పెంచుకోవడానికి ఏ యోగాసనాలు వేయాలో తెలుసుకుందాం.

బాలసనా (పిల్లల భంగిమ): ఈ యోగా ఆసనం తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బాలసనాను ఒకేసారి 30 సెకన్ల పాటు చేయాలి. క్రమంగా ఈ యోగాసనాన్ని చేసే సమయాన్ని పెంచవచ్చు.

త్రాటక్ ధ్యానం(త్రతక ధ్యానం): మెరుగైన కంటి చూపు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కోసం త్రాటక్ ధ్యానం మంచి మెడిసిన్. ఇది ఏకాగ్రతను పెంచడానికి ఒక గొప్ప అభ్యాసం. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా మేలు చేస్తుంది. ఈ యోగా టెక్నిక్‌లో కొంత సమయం పాటు ఒక పాయింట్‌పై దృష్టి పెట్టాలి. దీని వల్ల మనసుకు ప్రశాంతతతోపాటు ఏకాగ్రత పెరిగి కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

వృక్షాసనం (చెట్టు భంగిమ): పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వృక్షాసనం చేసేలా చేయాలి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం అందిస్తుంది. అంతేకాదు వృక్షాసనం చేయడం వల్ల మోకాళ్లు, చీలమండలు, దూడలు బలపడతాయి. దీనితో పాటు ఈ యోగాసనం వెన్నెముకను అనువైనదిగా చేస్తుంది. శారీరక భంగిమను మెరుగుపరుస్తుంది.

గరుడాసనం (డేగ భంగిమ): ఏకాగ్రతతో పాటు శరీర సమతుల్యత పెరగాలంటే పిల్లలను గరుడాసనం చేసేలా చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల శరీర భాగాల సమన్వయం మెరుగుపడుతుంది. భుజాలు, చేతులు, మోకాళ్ల కండరాల బలం కూడా పెరుగుతుంది.

భ్రమరీ ప్రాణాయామం( తేనెటీగ శ్వాస): ఇది ఒక ప్రశాంతమైన, శక్తివంతమైన యోగ శ్వాస టెక్నిక్. ఏకాగ్రత పెరగడానికి భ్రమరీ ప్రాణాయామం చేయడం చాలా మంచిది. పిల్లలు ఈ భ్రమరీ ప్రాణాయామం చేయాలంటే ముందుగా ప్రాణాయామం నేర్పించాల్సి ఉంటుంది. క్రమంగా భ్రమరీ ప్రాణాయామం ఈ టెక్నిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది బ్రీతింగ్ టెక్నిక్.. ఈ యోగాసనంతో పిల్లల్లో కోపం, ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది.





























